
ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ ఫుడ్‌బాల్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఆదివారం అర్జెంటీనా-నెదర్లాండ్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అమెరికన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ స్టేడియంలోని ప్రెస్ బాక్స్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు ధృవీకరించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడా అనేది ఇంకా తెలియరాలేదు.

సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తన సోదరుడిని, స్టేడియంతో ఎవరో హత్య చేశారని గ్రాంట్ వాల్ సోదరుడు ఎరిక్ ఆరోపించాడు. యూఎస్‌ఏ-వేల్స్ మ్యాచ్‌లో రెయిన్‌బో షర్ట్ ధరించాడని, గ్రాంట్ వాల్ హత్యకు గురయ్యాడని అతని సోదరుడు ఎరిక్ అంటున్నాడు.

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మృతి చెందిన గ్రాంట్‌కు ఫిఫా నివాళులు అర్పించింది. అల్ బయాత్ స్టేడియంలో ప్రెస్ బాక్స్‌లో అతను కూర్చున్న సీటులో తెల్లటి పువ్వుల గుత్తి అతని ఫొటో ముందు ఉంచింది.

అంతేకాకుండా గ్రాంట్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఫిఫా తన ట్విట్టర్ ఖాతాలో గ్రాంట్ ఫోటోను పోస్ట్ చేసింది.