
బుద్ధి చాతుర్యానికి, వ్యాపార ధోరణికి, షేర్లు, స్పెక్యులేషన్లకు ముఖ్య కారకుడైన బుధుడు ఈనెల(మే) 15న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుండగా, పట్టుదలకు, మొండి ధైర్యానికి కారకుడైన కుజుడు ఈ నెల 12 నుంచి మేష రాశిలోకి మారడం జరుగుతోంది. ఈ నెల 29 వరకు బుధుడి సంచారం కొనసాగుతుంది. కుజుడి సంచారం జూన్ 20 వరకు మేష రాశిలో కొనసాగుతుంది. ఈ రెండు గ్రహాల రాశి మార్పు వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారికి జీవితం హుందాగా, దర్పంగా, రాజసంగా గడిచిపోతుంది. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు ఉన్నత స్థితికి మారే అవకాశం ఉంది.

మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఇదే రాశిలోనూ, తృతీయాధిపతి అయిన బుధుడు ధన స్థానంలోనూ సంచారం చేయడం వల్ల చిన్న ప్రయత్నమైనా అత్యధికంగా లాభాలనిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ది చెందుతాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు వ్యయ స్థానంలోకి, కుజుడు లాభ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలను, సమస్యల్ని పరిష్కరించుకుంటారు. తప్పకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామా జికంగా కూడా హోదా పెరుగుతుంది. సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలోకి కుజుడు, దశమ స్థానంలోకి బుధుడు మారడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. విదేశీయాన యోగం పట్టే అవకాశం ఉంది.

కన్య: రాశినాథుడు బుధుడు భాగ్య స్థానంలో, కుజుడు తన స్వక్షేత్రమైన అష్టమ స్థానంలో సంచారం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుజుడి వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి లాభిస్తాయి. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో బుధుడి సంచారం చేయడం వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో కుజుడు, షష్ట స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో సహా ఎటువంటి సమస్యలైనా పరిష్కారమవుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం వంటివి జరుగుతాయి. పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఊహించని లాభాలనిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.