
ఖమ్మం జిల్లాలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వడగాలులకు అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడానికి కూడా జనం జంకుతున్నారు. మరోవైపు వడదెబ్బ మరణాలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. జంతువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. మండుతున్న ఎండల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవి కూడా కొత్త మార్గాలను వెతుక్కుంటున్నాయి. అలాంటి ఓ ఆసక్తికర ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది.

వైరా మున్సిపాలిటీ పరిధిలోని లీలాసుందరయ్యనగర్‌లో ఓ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన స్కూటీని ఓ పిచ్చుక తన సురక్షిత గూటిగా మార్చుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం తమ స్వగ్రామానికి వెళ్లిపోయింది. దీంతో వారి ద్విచక్ర వాహనం నెలరోజులకు పైగా అలాగే పార్కింగ్‌లో ఉండిపోయింది.

ఈ క్రమంలో స్కూటీ తాళం అమరిక పక్కన ఉన్న చిన్న ఖాళీ ప్రదేశాన్ని గమనించిన పిచ్చుక, అక్కడే గూడు నిర్మించుకుంది. అంతేకాదు, గూటిలో గుడ్లు కూడా పెట్టింది. తరచూ పిచ్చుకలు స్కూటీ వద్దకు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వాహనాన్ని పరిశీలించగా, అందులో గూడు, గుడ్లు కనిపించాయి.

మండే ఎండలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చెట్లపై గూళ్లు కట్టడం కష్టంగా మారడంతో, పిచ్చుక తన రక్షణ కోసం స్కూటీని ఆశ్రయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికులను ఆకట్టుకుంటుండగా, పిచ్చుక తన పిల్లలను కాపాడుకునేందుకు ఎంచుకున్న ఈ వినూత్న గూడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.