
దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని వండాల్సిన అవసరం లేదు, ఒక్క చుక్క నూనె కూడా వాడాల్సిన పనిలేదు. ఉల్లిపాయ తీపి, వెల్లుల్లి ఘాటు, పచ్చి జీలకర్ర సువాసనల కలయికతో కేవలం రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ అద్భుతమైన రెసిపీని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పూర్తి గడ్డల వెల్లుల్లి రెబ్బలు, సుమారు 2 నుండి 3 చెంచాల కారం పొడి, 1 టీస్పూన్ పచ్చి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం: ఉల్లిపాయలు కట్ చేసుకోవడం: రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసి, శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయల మొదలు భాగంలో ఉండే గట్టి భాగాన్ని తొలగించి, ముక్కలను మరీ సన్నగా కాకుండా కాస్త పెద్ద సైజు క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే తినేటప్పుడు ప్రతి ముద్దకూ ఉల్లిపాయ క్రంచీగా తగులుతూ భలే రుచిగా ఉంటుంది.

మిక్సీ లేదా రోట్లో దంచే విధానం: ఒక మిక్సీ జార్ లేదా రోలు తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొట్టు వలిచిన రెండు గడ్డల వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ పచ్చి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మరియు మీ కారానికి తగినట్లుగా కారం పొడి వేయాలి.

ఇప్పుడు మిక్సీని కంటిన్యూస్‌గా తిప్పకుండా కేవలం ఒక్కటి లేదా రెండు సార్లు పల్స్ మోడ్‌లో కచ్చాపచ్చాగా మాత్రమే తిప్పాలి. నీళ్లు చుక్క కూడా పోయకూడదు. రోట్లో నూరుకుంటే ఇంకా అద్భుతమైన రుచి వస్తుంది. ఉల్లిపాయలు పూర్తిగా పేస్ట్‌లా అయిపోకుండా చిన్న చిన్న పలుకుల్లా ఉండేలా చూసుకోవాలి.

ఈ కారంలో చింతపండు అస్సలు వేయరు. ఉల్లిపాయల్లోని సహజ తీపిదనం, వెల్లుల్లి ఘాటు సమపాళ్లలో కలిసి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. తడి తగలకుండా భద్రపరిస్తే ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, రాత్రి మిగిలిన చద్దన్నం, గట్టి పెరుగన్నంలోకి నంజుకున్నా, లేదా కాల్చిన జొన్న రొట్టె, సజ్జ రొట్టెతో తిన్నా కంచం మొత్తం ఇట్టే ఖాళీ అయిపోతుంది!