
ఇప్పుడు అందరి ఇళ్లలో వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ మెషిన్లలో డ్రైయర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల బట్టలు 100శాతం ఆరడంతో పాటు డ్రైయర్ సపరేట్ కొనాల్సిన అవసరం ఉండదు. బట్టలు ఉతికిన తర్వాత డ్రైయర్ సమయంలో అందులో 2 నుండి 3 ఐస్ క్యూబ్స్ వేయండి. డ్రైయర్ రన్ అవుతున్నప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ కరిగి ఆవిరిగా మారుతాయి. ఈ ఆవిరి బట్టల దారాల్లోకి చొచ్చుకుపోయి ముడతలను మృదువుగా చేస్తుంది. డ్రైయర్ ఆగిపోయే సమయానికి మీ బట్టలు ఇస్త్రీ చేసినట్లుగా, చాలా ఫ్రెష్‌గా బయటకు వస్తాయి.

టెక్స్‌టైల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి గాలిలో తేమ స్థాయి పెరిగినప్పుడు, నూలు, సింథటిక్ ఫైబర్‌లు త్వరగా వాటి సాధారణ స్థితికి వస్తాయి. ఈ పద్ధతిని స్టీమ్ రిలాక్సేషన్ అని పిలుస్తారు. దీని ద్వారా బట్టలలోని 80 శాతం ముడతలను సులభంగా తొలగించవచ్చని పరిశోధకులు నిర్ధారించారు.

ఒకవేళ మీ ఇంట్లో డ్రైయర్ సదుపాయం లేకపోయినా చింతించకండి. తెల్ల వెనిగర్‌తో మీరు సొంతంగా రింకిల్ రిమూవర్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఒక వంతు తెల్ల వెనిగర్, మూడు వంతుల నీటిని కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోండి. ముడతలు పడిన బట్టలను హ్యాంగర్‌కు తగిలించి, ఈ మిశ్రమాన్ని లైట్‌గా స్ప్రే చేయండి. బట్టలు ఆరే కొద్దీ అందులోని ముడతలు వాటంతట అవే మాయమైపోతాయి.

లాభాలు: గంటల కొద్దీ ఇస్త్రీ చేసే శ్రమ తప్పడంతో పాటు ఐరన్ బాక్స్ వాడకం తగ్గడం వల్ల కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. మితిమీరిన వేడితో ఇస్త్రీ చేయడం వల్ల బట్టల రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ సహజ ఆవిరి పద్ధతి వల్ల బట్టల నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుంది.

డ్రైయర్‌లో మరీ ఎక్కువ బట్టలు వేయకండి. గాలి ఆడటానికి తగినంత ఖాళీ ఉంటేనే ఐస్ క్యూబ్స్ ఆవిరి బాగా పనిచేస్తుంది. డ్రైయర్ ఆగిపోగానే బట్టలను వెంటనే బయటకు తీసి హ్యాంగర్‌కు తగిలించాలి. లేదంటే మళ్ళీ ముడతలు పడే అవకాశం ఉంది. కాగా బిజీ లైఫ్‌లో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన పనిని సులభతరం చేస్తాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో మీ బట్టలను కొత్తవాటిలా ఉంచుకోవడానికి ఈ పద్ధతిని తప్పకుండా ప్రయత్నించండి..