
ఆంధ్రా వంటకాల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే గోంగూరను 'ఆంధ్రా మాతా' అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు. గోంగూరతో పప్పు, నిల్వ పచ్చడి, రొయ్యల కూర ఇలా ఎన్నో రకాలు చేసినా.. పులిహోర శైలిలో చేసే గోంగూర పచ్చడి రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాంటి చట్నీలు, పచ్చళ్లు తిని బోర్ కొట్టినప్పుడు, నోటికి పుల్లగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తే వనమాస్ కిచెన్ అందించిన ఈ ‘పులిహోర గోంగూర పచ్చడి’ని ట్రై చేయాల్సిందే. పక్కా కొలతలతో దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు సులువుగా తెలుసుకుందాం.

గోంగూర సేకరణ మరియు వేయించడం ఈ పచ్చడి తయారీ కోసం తాజా ఎర్ర గోంగూరను తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది. గోంగూర ఆకులను కాడల నుండి వేరు చేసి, నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆకులను ఒక కాటన్ గుడ్డపై వేసి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆరబెట్టిన గోంగూర ఆకులను అందులో వేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించాలి. ఆకు అంతా మెత్తగా అయ్యి, దగ్గరకు పడే వరకు నిదానంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు మరియు గ్రైండింగ్ మరో బాండీలో కొద్దిగా నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు, ఒక టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించాలి.

ఇందులో మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చివరగా కొద్దిగా జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి, తగినంత ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు చేర్చి మొదట బరకగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త రోటి పచ్చడి లాగా గ్రైండ్ చేయాలి.

పులిహోర స్టైల్ పోపు ఈ పచ్చడికి అసలైన రుచిని ఇచ్చేది ఇందులో పెట్టే పులిహోర పోపు మాత్రమే. బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్లు, వేరుశనగ పప్పులు (పల్లీలు), కరివేపాకు, ముక్కలుగా చేసిన ఎండుమిర్చి మరియు కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ వేసి, మనం మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. ఎంతో సువాసనభరితమైన, నోరూరించే పులిహోర గోంగూర పచ్చడి సిద్ధం.