
కేవలం పది నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ కారం కారంగా ఉండే అటుకుల మిక్స్చర్ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లల స్నాక్ బాక్సుల కోసం, సాయంత్రం టీ సమయానికి, బర్త్ డే పార్టీలలో లేదా అప్పటికప్పుడు క్రిస్పీగా, కరకరలాడుతూ, కారం కారంగా ఏదైనా తినాలనిపించినా ఈ రెసిపీ సరైన ఎంపిక. ఈ మిక్చర్ తయారీకి పేపర్ అటుకులను ఉపయోగించడం చాలా ముఖ్యం. మందపాటి అటుకులు తీసుకుంటే వాటిని డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. పేపర్ అటుకులు తీసుకుంటే రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది.

అటుకులు వేయించుకోవాలి: ముందుగా ఒక పాన్ లోకి పావు కేజీ పేపర్ అటుకులను తీసుకోవాలి. వీటిని సన్నటి సెగ మీద నిదానంగా వేయించుకోవాలి. అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత వన్ థర్డ్ కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి.

అదే నూనెలో పుట్నాలు వేసి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి. పుట్నాలు వేగడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ తర్వాత పావు కప్పు జీడిపప్పు పలుకులు వేసి అవి కూడా దోరగా వేగేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, నాలుగైదు పచ్చి మిరపకాయలను చీల్చి వేయాలి. ఇందులోనే పావు కప్పు దంచిన వెల్లుల్లిపాయలను వేయాలి. వీటితో పాటు సన్నగా స్లైసెస్ కింద కట్ చేసిన రెండు ఇంచుల ఎండు కొబ్బరిని వేసి అన్నింటినీ దోరగా వేయించుకోవాలి.

ఇవి బాగా వేగిన తర్వాత పావు కప్పు కరివేపాకు వేసి, అది కూడా చిట్లంత వరకు ఫ్రై చేయాలి. స్టవ్ ఆపే ముందు అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం కలిపి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ కడాయిలోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకులన్నింటినీ వేసి, తాలింపు అటుకులకు బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలు, పల్లీలు, జీడిపప్పులను కూడా వేసి కలపాలి.

ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం, ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి, ఒకటిన్నర టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. చివరగా తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మొత్తం కలిపేయాలి. ఇలా బాగా కలిపేసుకుంటే అటుకుల మిక్స్చర్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా, కేవలం ఐదు నుండి పది నిమిషాల్లో ఈ స్నాక్ ను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న అటుకుల మిక్స్చర్ ను ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి స్నాక్స్ లేనప్పుడు, అటుకులు ఉంటే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి