
నువ్వులలో ఉండే సహజ కాల్షియం శరీరానికి బలాన్నిస్తే, పచ్చిమిర్చి కారం, వెల్లుల్లి ఘాటు, తాలింపులో వేగే పల్లీలు ముద్దముద్దకూ క్రంచీగా తగులుతూ నోటికి ఎంతో రుచిగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా ఏమాత్రం రుచి తగ్గని ఈ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాముల ఉడికించిన పొడిపొడి అన్నం, రెండున్నర టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 - కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు, పావు కట్ట కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్లు / పల్లీలు, రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.

తయారీ విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మీడియం మంటపై చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేసి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పొట్టు వలిచిన 20 వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు వేయించాలి. వేగిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా నువ్వులు ఉన్న మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి-నువ్వుల పొడి, రెండు రెమ్మల కరివేపాకు, నిలువుగా చీల్చిన రెండు పచ్చిమిరపకాయలు వేసి సిమ్ ఫ్లేమ్‌లో ఒక్క నిమిషం వేయించాలి. పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

చివరగా ముందుగా ఉడికించి చల్లార్చుకున్న 200 గ్రాముల పొడిపొడి అన్నాన్ని పాన్‌లో వేసి, మసాలా మొత్తం అన్నానికి సమానంగా పట్టేలా మీడియం మంటపై బాగా కలపాలి. అంతే, ఘుమఘుమలాడే పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం సిద్ధం! వేడివేడిగా తిన్నా లేదా బాక్స్‌లో సర్వ్ చేసుకున్నా లొట్టలేసుకుంటూ తింటారు!