
రవ్వ లడ్డు అంటే ఇష్టపడని వారుండరు. అయితే, రెగ్యులర్‌గా చేసే రవ్వ లడ్డుల కంటే ఇది వేరు. వెన్నలా కరిగిపోయేంత మృదువుగా, అదిరిపోయే రుచితో రవ్వ లడ్డూలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ అద్భుతమైన రవ్వ లడ్డూలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ లడ్డూలు పది రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ (బొంబాయి రవ్వ/సుజి) - 1 గ్లాసు, పాలు (కాచి చల్లార్చినవి, చిక్కటివి) - 1/2 గ్లాసు, ఉప్పు - చిటికెడు, చక్కెర - 3/4 గ్లాసు (తీపి తక్కువ కావాలంటే 1/2 గ్లాసు), యాలకుల పొడి - 1/2 టీస్పూను, నెయ్యి - 3-4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10-15, బాదంపప్పు - 10 (సన్నగా తరిగినవి), ఎండు ద్రాక్ష - కొన్ని, ఎండు కొబ్బరి ముక్కలు - ఒక గుప్పెడు, డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.

ముందుగా, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేయండి. ఈ రవ్వ సుమారు పావు కేజీ ఉంటుంది. ఇప్పుడు రవ్వలో ఒక్క చిటికెడు సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత, ఏ గ్లాసుతో రవ్వ తీసుకున్నారో అదే గ్లాసుతో కొలతగా పెట్టుకుని, అర గ్లాసు కాచి చల్లార్చిన చిక్కటి పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ రవ్వను కలుపుకోవాలి. పాలను ఒకేసారి పోయకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మొత్తం పాలు పోసి కలిపిన తర్వాత, రవ్వ మిశ్రమం కాస్త లూజ్‌గా అనిపించినా, 15-20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఈ సమయంలో రవ్వ పాలను పూర్తిగా పీల్చుకుని గట్టిపడుతుంది, అలాగే రవ్వ కూడా చక్కగా నానుతుంది.

15-20 నిమిషాల తర్వాత, రవ్వ ముద్ద గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను స్టవ్‌పై వేడి చేయండి. నూనె వేడైన తర్వాత, రవ్వ మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా తీసుకుని వేడి నూనెలో వేయాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల లడ్డూలు చాలా మృదువుగా, రుచిగా వస్తాయి. మీకు నూనెలో వేయించడం ఇష్టం లేకపోతే, ఈ రవ్వ ముద్దతో చపాతీల్లాగా చేసి పెనంపై కాల్చుకోవచ్చు, అయితే నూనెలో వేయించినవి మరింత రుచిగా ఉంటాయి. వేయించిన రవ్వ ముద్దలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

అదే నూనెలో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలను వేసి సిమ్‌లో పెట్టి ఎర్రగా వచ్చేవరకు వేయించాలి. కొబ్బరి మాడకుండా చూసుకోవాలి, లేదంటే రుచి మారిపోతుంది. వేగిన కొబ్బరి ముక్కలను కూడా రవ్వ ముద్దలున్న ప్లేట్లోకి తీసుకోండి. వేయించిన రవ్వ ముద్దలు, ఎండు కొబ్బరి ముక్కలు చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇది పూర్తిగా మెత్తగా కాకుండా, కాస్త బరకబరక్గా రవ్వ రవ్వగానే ఉంటుంది. ఈ పొడిని ఒక బేసిన్ లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో, రవ్వ తీసుకున్న గ్లాసుతో కొలుచుకుని, ముప్పావు గ్లాసు చక్కెరను వేసి బరకగా మిక్సీ పట్టండి. తీపి తక్కువ తినేవారు అర గ్లాసు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చక్కెర పొడిని కూడా రవ్వ మిశ్రమంలో కలపండి. రవ్వ, చక్కెర పొడుల మిశ్రమంలో అర టీస్పూను యాలకుల పొడి వేసి బాగా కలపాలి. యాలకులు లేకపోతే, రవ్వను మిక్సీ పట్టినప్పుడే ఐదారు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి, అందులో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, సన్నగా తరిగిన బాదంపప్పు వేసి లైట్‌గా వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత, ఎండు ద్రాక్ష కూడా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి, ఈ డ్రై ఫ్రూట్స్‌ను నెయ్యితో సహా రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.