
అందమైన చర్మాన్ని పొందేందుకు చాలా మంది అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతారు. కానీ ఇవి వాళ్లకు పూర్తి పరిష్కారాన్ని అందించలేవు. కొన్ని సార్లు అవే వాళ్ల చర్మాన్ని నాశనం చేయవచ్చు. కాబట్టి మన వంటింట్లో ఉండే పందారతో ఈజీగా చర్మ నిగారింపును పెంచుకోవచ్చు. ఇందుకోసం కోసం బాడీ వాష్ లేదా లిక్విడ్ సోప్‌లో ఒక స్పూన్ పంచదార కలిపి స్నానానికి ముందు శరీరం మొత్తాన్ని సున్నితంగా రుద్దుకోండి. స్నానం చేసిన తర్వాత మీ చర్మం మృదువుగా మెరుస్తూ కనిపిస్తోంది.

హడావిడిగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ముఖానికి ఫేషియల్ చేసుకునే సమయం లేనప్పుడు, ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం రోజువారీ వాడే సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ముఖంపై నురుగు ఉండగానే కొద్దిగా పంచదారతో సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది ముఖాన్ని అత్యంత మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. ఈ స్క్రబ్‌ను తరచుగా కాకుండా, అప్పుడప్పుడు చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

డ్రై స్కిన్ ఉన్నవారు స్క్రబ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెను రాసుకోవచ్చు. చర్మం సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, 12-13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ స్క్రబ్‌ను ఉపయోగించరాదని నిపుణులు చెబుతున్నారు. స్క్రబ్ చేసేటప్పుడు చాలా సున్నితంగా, చంటి పిల్లను శుభ్రం చేసినంత జాగ్రత్తగా వృత్తాకార కదలికలలో రుద్దుకోవాలి. కళ్ళు, పెదవుల ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కాఫీ స్క్రబ్: కాఫీ పొడి కూడా మన చర్మ నిగారింపు పెంచడంతో ఎంతో బాగా పని చేస్తుంది. దీని కోసం ఫ్రెష్ కాఫీ పౌడర్‌ను కాకుండా, ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన పొడిని వాడాలి. ఈ తడి కాఫీ పొడిలో ఒక స్పూన్ పంచదార, అర స్పూన్ లేదా ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి స్క్రబ్‌గా ఉపయోగించాలి. ఈ మూడు నూనెలు చర్మానికి చాలా మంచివి.

కాఫీ స్క్రబ్‌ను మొహం, మెడ, చేతులు, శరీరం మొత్తానికి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మోచేతులు, ముంజేతుల వద్ద చర్మం రంగు తేడాను తగ్గించి, చర్మాన్ని ఒకే రంగులోకి తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాఫీ స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే సబ్బు వాడకపోవడమే మంచిది, ఎందుకంటే నూనె ప్రభావం చర్మంపై నిలిచి ఉంటుంది. ఒకవేళ జిడ్డుగా అనిపిస్తే, సాయంకాలం మళ్ళీ స్నానం చేసేటప్పుడు సబ్బు వాడుకోవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు)