
మీరు చాలా తేలికైన, పొట్టకు హాయినిచ్చే ఆహారం తినాలనుకుంటే పెసరపప్పు సరైన ఎంపిక. ఇది చాలా సులభంగా అరుగుతుంది. అందుకే అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా పొట్ట కాస్త అప్సెట్ అయినప్పుడు వైద్యులు పెసరపప్పు కిచేరి లేదా పెసరకట్టు తినమని సలహా ఇస్తారు. దీని రుచి చాలా మైల్డ్ ఉంటుంది. త్వరగా ఉడుకుతుంది. రాత్రి వేళల్లో తేలికపాటి భోజనం చేయాలనుకున్నప్పుడు లేదా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పెసరపప్పు ఉత్తమమైనది.

మన దేశంలో అత్యధిక ఇళ్లలో ప్రతిరోజూ వాడేది కందిపప్పే. కందిపప్పుకు కమ్మటి, బలమైన రుచి ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఇది పర్ఫెక్ట్ జోడీ. కొందరిలో కందిపప్పు తింటే కాస్త బరువుగా అనిపించడం లేదా గ్యాస్ రావడం జరగొచ్చు. అలాంటప్పుడు పప్పును వండటానికి ముందు కాసేపు నానబెట్టడం, వండేటప్పుడు కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి చేర్చడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

పోషకాల పరంగా చూస్తే ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. రెండు పప్పులూ పల్సెస్ జాబితాకే చెందుతాయి. రెండింటిలోనూ శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం నాణ్యమైన ప్లాంట్ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఒకదాని కంటే ఇంకొకటి గొప్పదని ఖచ్చితంగా చెప్పలేం. పరిశోధనల ప్రకారం కూడా రెండు పప్పులు శరీరానికి వేర్వేరు రకాలుగా మేలు చేస్తాయి. మీ ఆనాటి భోజన అవసరాన్ని బట్టి ఏది వండుకోవాలనేది మారుతుంది.

న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం.. డైట్‌లో ఏదో ఒక పప్పుపైనే ఆధారపడటం కంటే రెండింటినీ మార్చి మార్చి తినడం అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతి. తేలికపాటి భోజనం, సులభమైన జీర్ణక్రియ కావాలనుకున్నప్పుడు పెసరపప్పును, కమ్మటి రుచి, కడుపు నిండే భోజనం కావాలనుకున్నప్పుడు కందిపప్పును ఎంచుకోవాలి. ఒకే రకమైన పప్పుకు పరిమితం కాకుండా వారంలో రెండు పప్పులను వాడుకుంటూ వైవిధ్యాన్ని కాపాడుకుంటే రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

మార్కెట్లో పప్పులు కొనేటప్పుడు నాణ్యమైనవి, తాజాగా ఉన్నవి ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనేటప్పుడు ప్యాకెట్ వెనుక ఉన్న వివరాలను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే పెసరపప్పులో పొట్టు పప్పు, ముడి పప్పు, పసుపు పప్పు అని రకాలు ఉంటాయి. అలాగే కందిపప్పులోనూ రకాలు ఉంటాయి. ఇవి వండే విధానాన్ని బట్టి జీర్ణమయ్యే తీరు మారుతుంది. కాబట్టి బ్రాండ్స్ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.