
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు (UTI) అనేవి మూత్రాశయం, మూత్రనాళం, కిడ్నీలను ప్రభావితం చేసే సమస్యలు. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం స్త్రీలు సరైన మోతాదులో నీరు త్రాగకపోవడం. నేటి కాలంలో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్ళే స్త్రీలు, బయట ప్రదేశాలలో సరైన మరుగుదొడ్ల సదుపాయాలు లేకపోవడం వల్ల మూత్రాన్ని ఆపుకోవడం వంటి కారణాలతో తక్కువ నీరు తాగుతుంటారు.

తక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను, విషపదార్థాలను, యూరిక్ యాసిడ్‌ను, లవణాలను బయటకు పంపినప్పుడు, తగినంత నీటితో కలిసి అవి పలచబడవు. దీనివల్ల మూత్రం అత్యంత గాఢంగా తయారవుతుంది. ఈ గాఢమైన మూత్రాన్ని విసర్జించినప్పుడు, మూత్రనాళం మరియు యోని చివర భాగాలు చికాకుకు గురై, అక్కడి పొరలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఈ గాఢతకు మంట కూడా వస్తుంది.

తగినంత పరిశుభ్రత పాటించకపోయినా, ఈ భాగాలలో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చాలా మంది స్త్రీలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నా, తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు, దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ఉపశమనం వచ్చినా, ఈ సమస్య తిరిగి వచ్చే అవకాశం ఉంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఇవి పాటిస్తే చాలు. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, మూలాల నుండి సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయి. నీరు ఎక్కువగా త్రాగడం, అవసరమైనప్పుడు తేనె ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్ వంటివి చేయమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు, రోగనిరోధక శక్తిని పెంపొందించే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లతో పోరాడే మూడు ఆమ్లాల గురించి చెబుతున్నారు. అవి.. బీటా-సైటోస్టిరాల్, క్యాంపీస్టిరాల్, వాలెనిక్ యాసిడ్. ఈ మూడు ఆమ్లాలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

ఈ మూడు ముఖ్యమైన ఆమ్లాలు కొండపిండి ఆకులో అత్యధిక మోతాదులో లభిస్తాయి. 2012 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కొలంబో, శ్రీలంక నిర్వహించిన పరిశోధనలు కొండపిండి ఆకు స్త్రీలలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు. కొండపిండి ఆకు పల్లెటూళ్లలో ఉంటుంది. దీన్ని మరిగించి డికాక్షన్ రూపంలో త్రాగవచ్చు. కొండపిండి ఆకు పొడి మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఒక స్పూన్ పొడిని ఒక కప్పు వేడి నీటిలో కలిపి త్రాగవచ్చు, ఇంకా మీరు నీటిలో వేసి దీనిని మరిగించి డికాషన్‌గా కూడా తీసుకోవచ్చు.