
కావాల్సిన పదార్థాలు: కంద తురుము 4 కప్పులు, చింతపండు రసం 1 కప్పు, ఎర్ర కారం పొడి 1 కప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1 టీస్పూన్, వేయించిన మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్, వేరుశనగ నూనె – 1.5 కప్పులు, ఆవాలు 2 టీస్పూన్లు, శనగపప్పు 1 టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్, మెంతి గింజలు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 3 ఎండుమిర్చి , కరివేపాకు కొన్ని రెబ్బలు, ఇంగువ 2 టీస్పూన్లు తీసుకోవాలి.

ముందుగా కందను శుభ్రంగా కడిగి, పైన ఉన్న చెక్కును పూర్తిగా తీసివేయాలి. కందను చెక్కు తీసేటప్పుడు చేతికి దురద తగలకుండా జాగ్రత్త పడాలి. మార్కెట్ నుండి తెచ్చిన కందను వెంటనే ఉపయోగించకుండా, రెండు మూడు రోజులు నిల్వ ఉంచి వాడితే దురద తగ్గుతుంది. చెక్కు తీసిన తర్వాత కందను మరోసారి కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. కందకు బొట్టు నీరు ఉన్నా పచ్చడి నిల్వ ఉండదు.

తడి ఆరిన కందను ఒక బౌల్లోకి సన్నగా తురుముకోవాలి. అర కేజీ కంద సుమారు నాలుగు కప్పుల తురుము అవుతుంది. ఈ తురుమును పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో ఒక కప్పు చిక్కటి చింతపండు రసం తీసుకుని, మీడియం మంటపై దగ్గరపడే వరకు ఉడికించాలి. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

మరొక పాన్లో ఒకటిన్నర కప్పుల వేరుశనగ నూనె లేదా పప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతి గింజలు వేసి, పప్పులు కొద్దిగా వేగాక, కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి, నూనె వేడికే అవి వేగేలా చూడాలి. చివరగా, ఇంగువ వేసి, తాలింపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.

తురిమి పెట్టుకున్న కందలో ఒక కప్పు కారం, అర కప్పు ఉప్పు, ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ వేయించిన మెంతిపొడి, రెండు టీస్పూన్ల వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇందులో చల్లారిన చింతపండు గుజ్జును కూడా వేసి కలిపిన తర్వాత, పూర్తిగా చల్లారిన తాలింపును వేసి మొత్తం పచ్చడిని బాగా కలపాలి.నిల్వ పచ్చళ్లకు నూనె అధికంగా ఉండటం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పచ్చడి నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్లకు బదులుగా శుభ్రమైన, తడిలేని గాజు సీసాలను ఉపయోగించడం శ్రేయస్కరం. ఇది పచ్చడి రుచిని, నాణ్యతను ఎక్కువ కాలం కాపాడుతుంది.