
పానిపూరి అనగానే అందరి గుర్తేచి కాస్త పుల్లగా, కారంగా ఉండే రసం. కానీ వేసవి కాలంలో ఉండే తీవ్రమైన వేడి, బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేది ఇదేనట. ఈ పాని తయారు చేయడానికి ఉపయోగించే నీరు స్వచ్ఛమైనది కాకపోతే, అందులో ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు బ్యాక్టీరియా కంటే కూడా అవి విడుదల చేసే విషపదార్థాలే శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయంటున్నారు. ఇది హఠాత్తుగా డీహైడ్రేషన్, శరీర అవయవాల వైఫల్యానికి దారితీస్తుందట.

అంతేకాదు పానీపూరి కోసం తయారు చేసే బఠానీ మసాలాలను ఎక్కువ సేపు వేడి చేయడం చాలా ప్రమాదమట. ఎండ వేడికి ఇలా తెరిచి ఉంచే వెజిటబుల్ మిశ్రమాలలో రోగకారక క్రిములు వేగంగా వృద్ధి చెందుతాయట. దీన్ని తినడం వల్ల అతిసారం, వాంతులు, కడుపునొప్పి వంటి ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు వస్తాయట. చాలా మంది వీధి వ్యాపారులు గ్లౌజులు ధరించకుండా, చేతులు శుభ్రం చేసుకోకుండానే పానిపూరిని అమ్ముతుంటారు. ఇది టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతుందట. రోడ్డు పక్కన ఉండే దుమ్ము, వాహనాల పొగ, ఈగలు వాలడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వేసవి నేపథ్యంలో స్ట్రీట్‌ఫుడ్‌లపై తనిఖీలను కఠినతరం చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లైసెన్స్ లేని వ్యాపారులు, పరిశుభ్రత పాటించని వారిపై చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలాగే పానిపూరి తయారీకి ఉపయోగించే నీటి నాణ్యతను పరీక్షించేందుకు శాంపిల్స్ సేకరించేందుకు సిద్ధమైంది. కాబట్టి జనాలు కూడా పానిపూరీ తినేందుకు అక్కడ శుభ్రతను చూసుకోండి. అక్కడ నీట్‌గా లేకపోతే తినడం మానేయండి.

అంటే పానిపూరిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పానిపూరి బండి చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉందో లేదో చూడండి. ఆహార పదార్థాలను సరిగ్గా మూసి ఉంచారో లేదో గమనించండి. పాని తయారీకి మినరల్ వాటర్ లేదా ప్యూరిఫైడ్ వాటర్ ఉపయోగించారో లేదో తెలుసుకోండి. మసాలాలు, చట్నీలు అప్పటికప్పుడు తాజాగా తయారు చేసినవేనా అని గమనించండి. ఎక్కువ మంది జనాలు వచ్చే దుకాణాలలో ఆహార పదార్థాలు త్వరగా అయిపోతుంటాయి కాబట్టి అక్కడ నిల్వ ఉంచిన ఆహారం లభించే అవకాశం తక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు అక్కడే తినేందుకు ట్రై చేయండి.

తాగే నీటికి కూడా ఎంతో ఖరీదు చెల్లించాల్సిన ఈ వేసవి కాలంలో, రోడ్డు పక్కన తక్కువ ధరకే దొరికే పానిపూరి నీరు ఎంతవరకు సురక్షితమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం రుచిని చూసి మీరు వాటిని విపరీతంగా తింటే రాబోయే రోజుల్లో అది మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.