
చలికాలం వచ్చిందంటే చాలు పిల్లలపై పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే వారికి ఇచ్చే ఆహారం విషమంలో మాత్రం వారు గందరగోళానికి గురవుతారు. ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు అరటి పండ్లు ఇవ్వడం మంచిది కాదని.. దాని వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు వస్తాయని భావిస్తారు. కానీ ఇది అస్సలు వాస్తవం కాదు.. అరటి పండ్లలో మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ముఖ్యంగా ఈ పండ్లలో పిల్ల ఎముకల పెరుగుదలకు కావాల్సిన పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి, కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వాటిలోని కార్బోహైడ్రేట్లు పిల్లలకు శక్తిని అందిస్తే.. ఫైబర్ మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది.

చలికాలంలో అరటిపండ్లు తింటే నేరుగా జలుబు లేదా ఫ్లూ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి, చలికాలం వచ్చిందన్నంత మాత్రాన పిల్లలకు అరటిపండ్లు ఇవ్వడం పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. కానీ వాటిని తిన్న తర్వాత మీకు అసౌకర్యం, అలెర్జీ లక్షణాలు లేదా ఇతర సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అయితే పిల్లలు ఆరు నెలలు దాటే వరకు వాళ్లకు అరటి పండును ఇవ్వకూడదు.. ఆ తర్వాత కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి. పిల్లకు ఎప్పుడూ పండును మెత్తగా చేసి మాత్రమే తినిపించండి. కొంచెం పెద్ద పిల్లలకు వారి వయసును బట్టి మెత్తటి, చిన్న ముక్కలు ఇవ్వవచ్చు. అలాగే మీ పిల్లలు పండ్లు తినేప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచండి. అలాగే అరటి పండ్లను ప్రిజ్‌లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద పెట్టి మాత్రమే పిల్లలకు ఇవ్వండి.

అయితే పిల్లలకు పండ్లు ఇచ్చే విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి వయస్సు, ఆకలి, జీర్ణశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తిన్న తర్వాత వారికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగితే, మోతాదును గమనించి, వైద్య సలహా తీసుకోవాలి. మొత్తమ్మీద, చలికాలంలో పిల్లలకు అరటిపండ్లు ఇవ్వవచ్చు. అయితే, ఆరు నెలల లోపు పిల్లలకు తల్లిపాలు లేదా తగిన శిశు ఫార్ములా ఇవ్వడం ముఖ్యం; వైద్య సలహా లేకుండా ఘన ఆహారాలను పరిచయం చేయకూడదు.