
పుచ్చకాయ తొక్కతో ఉన్నంత వరకు చాలా సురక్షితం. కానీ దానిని ముక్కలుగా కోసినప్పుడు గాలిలోని బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం, సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి ఇది సరైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా ఫ్రిజ్‌లో మూత పెట్టకుండా ఉంచే పుచ్చకాయ ముక్కలపై హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. వీటిని తినడం వల్ల పిల్లలు, పెద్దలలో విరేచనాలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తగ్గుతున్న పోషక విలువలు: కొన్ని పరిశోధనల ప్రకారం.. పుచ్చకాయను కోయకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడే అందులో ఉండే లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. అదే పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దానిలోని సహజ పోషక విలువలు గణనీయంగా తగ్గిపోతాయి. అంతేకాకుండా అది తన సహజమైన ఎరుపు రంగును, రుచిని కూడా కోల్పోతుంది.

ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సి వస్తే..: ఒకవేళ పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పుచ్చకాయ ముక్కలను గిన్నెలో పెట్టి ఓపెన్‌గా వదిలేయకూడదు. వాటిని తప్పనిసరిగా గాలి చొరబడని డబ్బాలో లేదా జాడీలలో పెట్టి మూత ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ ముక్కలను గరిష్టంగా 24 గంటల లోపు తినేయాలి. రోజుల తరబడి నిల్వ ఉంచిన ముక్కలను అస్సలు తినకూడదు.

పరిశుభ్రత ముఖ్యం: పుచ్చకాయను కోయడానికి ముందే దాని తొక్కను బాగా కడగాలి. అలాగే కోసే కత్తిని, మీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే చల్లటి ముక్కలను తినడం వల్ల గొంతు నొప్పి, జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రిజ్ నుండి తీసాక కాసేపు పక్కన పెట్టి, గది ఉష్ణోగ్రతకు వచ్చాకే తినాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పుచ్చకాయను ఎల్లప్పుడూ తాజాగా ఉన్నప్పుడే కోసుకుని వెంటనే తినడం ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం. వీలైనంత వరకు నిల్వ ఉంచిన పండ్లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. (గమనిక : ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన, సాధారణ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఏదైనా ఆరోగ్య సమస్య లేదా సందేహం ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.