
కావలసిన పదార్థాలు: 1 కప్పు మందపాటి అటుకులు, అర కప్పు పెసరపప్పు, పప్పు ఉడికించడానికి 2 కప్పులు + అటుకులు ఉడికించడానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు, పావు టీస్పూన్ పసుపు పప్పులో, పావు టీస్పూన్ పసుపు తాలింపులో, రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 10 నుండి 12 మిరియాలు, అర టీస్పూన్ కచ్చాపచ్చాగా దంచిన, మిరియాల పొడి , 1 టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి పప్పు వేపుడుకు, 3 నుండి 4 టీస్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి తాలింపుకు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీస్పూన్, 2 టీస్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర తరుగు.

తయారీ విధానం: అర కప్పు పెసరపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీరు వార్చుకోవాలి. కుక్కర్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేడిచేసి, కడిగిన పెసరపప్పు వేసి పచ్చివాసన పోయేలా 2 నుండి 3 నిమిషాలు దోరగా వేయించాలి. పప్పు లేత రంగు మారగానే అర కప్పు పప్పుకు నాలుగు రెట్లు అంటే 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇందులో పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, 10-12 మిరియాలు వేసి కలిపి.. కుక్కర్ మూతపెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి.

పప్పు ఉడికేలోపు ఒక కప్పు మందపాటి అటుకులను నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీరు తీసి పక్కన ఉంచుకోవాలి (నానబెట్టకూడదు). కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి చూస్తే పప్పు మెత్తగా మాష్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులో కడిగిన అటుకులు, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు (400 ml) మరియు మిగిలిన రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మీడియం మంటపై 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి; ఉడుకుతున్నప్పుడు పైకి వచ్చే నురుగును గరిటెతో తీసేయాలి.

వేరొక పాన్‌లో 3-4 టీస్పూన్ల నెయ్యి వేడిచేయాలి. నెయ్యి కాగాక అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. జీడిపప్పు వేగాక అర టీస్పూన్ దంచిన మిరియాలు, కరివేపాకు, మంచి రంగు కోసం పావు టీస్పూన్ పసుపు వేసి వేయించాలి.

ఈ వేడివేడి సువాసనభరిత తాలింపులోకి ఉడుకుతున్న అటుకులు-పప్పు మిశ్రమాన్ని పోసి బాగా కలిపి, మూతపెట్టి 2 నుండి 3 నిమిషాలు మగ్గించాలి. పొంగలి కాస్త జారుడుగా ఉన్నప్పుడే పిడికెడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారే కొద్దీ మరింత చిక్కబడుతుంది. అంతే, నోరూరించే కమ్మనైన 'అటుకుల పొంగలి' సిద్ధం. కొబ్బరి చట్నీతో లేదా వేడివేడిగా కాస్త నెయ్యి వేసుకుని తింటే వెన్నలా కరిగిపోతూ అమృతంలా ఉంటుంది !