
కొనేటప్పుడే జాగ్రత్త: చాలామంది పూర్తిగా పండిన, మెత్తటి పండ్లనే ఎంచుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. సగం పండిన లేదా కొంచెం దోరగా ఉన్న పండ్లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఇవి ఇంట్లో నెమ్మదిగా పండుతాయి కాబట్టి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పండుపై నల్లటి మచ్చలు లేకుండా చూసుకోవడం ముఖ్యం.

ఇథిలీన్ గ్యాస్ పట్ల జాగ్రత్త: మామిడి పండ్లు సహజంగా ఇథిలీన్ అనే వాయువును విడుదల చేస్తాయి. ఇది పండ్లను పండించడానికి సహాయపడుతుంది. పండిన మామిడి పండ్లను, పచ్చి పండ్లను కలిపి ఉంచకూడదు. పండిన పండు విడుదల చేసే ఇథిలీన్.. పక్కన ఉన్న పచ్చి పండ్లను అకాలంగా పండించి, కుళ్లిపోయేలా చేస్తుంది. మామిడి పండ్లను ఆపిల్స్ లేదా అరటిపండ్లకు దూరంగా ఉంచాలి, ఎందుకంటే అవి కూడా ఇథిలీన్‌ను విడుదల చేస్తాయి.

గాలి తగిలేలా నిల్వ చేయండి: మామిడి పండ్లకు గాలి తగలడం చాలా ముఖ్యం. మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే ప్లాస్టిక్ కవర్లలో నుండి పండ్లను తీసేయండి. ప్లాస్టిక్ వల్ల వేడి పెరిగి చెమట పట్టినట్లు అవుతుంది, దీనివల్ల బ్యాక్టీరియా చేరి పండు త్వరగా మెత్తబడిపోతుంది. పండ్లను వెదురు గంపల్లో లేదా గాలి ఆడే చెక్క పెట్టెల్లో నిల్వ చేయడం ఉత్తమం. నేలపై పేపర్ వేసి దానిపై పండ్లను విడివిడిగా అమర్చడం కూడా మంచి పద్ధతి.

తేమను నివారించండి: పండ్లను నిల్వ చేయడానికి ముందు ఎప్పుడూ కడగకూడదు. తడి వల్ల ఫంగస్ లేదా బూజు పట్టే అవకాశం ఉంది. మీరు పండ్లను త్వరగా పండించాలనుకుంటే బ్రౌన్ పేపర్ బ్యాగ్‌లో ఉంచండి. అదే ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే ఒక్కో పండును న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌లో చుట్టి ఉంచండి. ఇది అదనపు తేమను పీల్చుకుంటుంది.

ఫ్రిజ్‌లో ఎప్పుడు పెట్టాలి: చాలామంది చేసే తప్పు.. పచ్చి మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం. పండ్లు పూర్తిగా పండేవరకు గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కూడా ఒకదానిపై ఒకటి కాకుండా, విడివిడిగా టిష్యూ పేపర్‌లో చుట్టి వెజిటబుల్ బాక్స్‌లో ఉంచితే 5-7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అదేవిధంగా నిల్వ చేసిన మామిడిపండ్లను ప్రతిరోజూ మెల్లగా తిప్పుతూ ఉండాలి. ఒకే వైపు ఎక్కువ రోజులు ఉంచితే ఆ భాగంపై ఒత్తిడి పడి మెత్తబడిపోతుంది.