
మీరు గుడ్డు పెంకు విరిగిపోకుండా చక్కగా రావాలంటే.. గుడ్లు ఉడకబెట్టే మరుగుతున్న నీటిలో చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ వెనిగర్ కలపండి. ఇలా చేయడం వల్ల గుడ్డు పెంకులు సులభంగా వేరుపడి, ఒలవడానికి ఈజీగా ఉంటుంది. మరో చిట్కా ఏమిటంటే గుడ్లు ఉడికిన తర్వాత వాటిని 10 నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉంచండి. ఇలా చేస్తే కూడా పెంకు త్వరగా వస్తుంది.

గుడ్డు ఉడికిన తర్వాత, దాని పెంకుపై చిన్న పగుళ్లు ఏర్పడేలా ఒక పళ్ళెం లేదా కౌంటర్పై మెల్లగా తట్టండి. తర్వాత ఆ పగుళ్ల వెంబడి మెల్లగా పొట్టు తీయండి. అంతే గుడ్డు పెంకు ఈజీగా వచ్చేస్తుంది. మరో చిట్కా ఏమిటంటే ట్యాప్ కింద గుడ్డును ఒలిస్తే కూడా పెంకులు చాలా త్వరగా వచ్చేస్తాయి.

మీరు గుడ్లను ఆమ్లెట్ లేదా కూరలోకి కాకుండా ఉడకబెట్టాలి అనుకుంటే ఎప్పుడూ కొంచెం పాత గుడ్లనే వాడండి. ఎందుకంటే చాలా తాజాగా ఉన్న గుడ్ల తొక్క తీయడం కష్టం అవుతుంది. అదే వారం లేదా 10 రోజుల పాత గుడ్లు ఉంటే వాటి తొక్క తీయడం సులభం.

గుడ్ల తొక్క సరిగ్గా రావాలంటే వాటిని సరిగ్గా ఉడకబెట్టడం చాలా ముఖ్యం. వాటిని తక్కువ-మధ్యస్థ మంట మీద సుమారు 10 నిమిషాల పాటు ఉడకబెడితేనే పొట్టు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. లేదంటే తొక్క తీసేప్పుడు గుడ్డు పగిలిపోవడం లేదా పెంకులకు అతుక్కుపోవచ్చు.

ఇన్ని చిట్కాలు ప్రయత్నించినా కూడా మీరు గుడ్డు పెంకును సరిగ్గా, త్వరగా తీయలేకపోతే.. మార్కెట్లో మీకు గుడ్ల పొట్టు ఒలిచే పరికరాలు దొరుకుతాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ సారి గుడ్లు ఉడకబెట్టినప్పుడు పైన చెప్పిన చిట్కాలను పాటించి ట్రై చేయండి.