
మనం ఎప్పుడైనా థియేటర్‌కు వెళ్తే.. అక్కడ దొరికే పాప్‌కార్న్ చూసి మన మనసు లాగేస్తూ ఉంటుంది. కానీ దాన్ని కొందామని దగ్గరికి వెళ్తే.. వాడు చెప్పే ధర మన జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది.కానీ ఇకపై కాదు. అవును మీరు థియేటర్ దొరికే టేస్ట్‌తోనే ఇంట్లో సులభంగా క్యారమెల్ పాప్‌కార్న్ చేసుకోవచ్చు. ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ పంచుకున్న రెసిపీ ప్రకారం.. ఇంట్లో దొరికే సులభమైన పదార్థాలతో కేవలం 20 నిమిషాల్లోనే మీరు ఎంత రుచికరంగా, క్రిస్పీగా ఉండే క్యారమెల్ పాప్‌కార్న్‌ను పొందవచ్చు. అదెలానో చూద్దాం.

క్యారమెల్ పాప్‌కార్న్ కోసం కావలసిన పదార్థాలు విషయానికి వస్తే పాప్‌కార్న్ గింజలు: 1/2 కప్పు, సన్నని చక్కెర: 1 కప్పు, వెన్న: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు: 1/4 టీస్పూన్, బేకింగ్ సోడా: 1/4 టీస్పూన్ , నూనె: పాప్‌కార్న్ వేయించడానికి సరిపడా. ఈ కొన్ని పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా థియోటర్ తరహా పాప్‌కార్న్‌ను తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం: ముందుగా, ఒక లోతైన బాణలిలో కొద్దిగా నూనె , వెన్న వేసి మీడియం ప్లేమ్‌లో వేడి చేయండి. వెన్న కరిగి నూనె రూపంలోకి వచ్చాక కొన్ని మొక్కజొన్న గింజలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. గింజలు పేలడం ప్రారంభించిన వెంటనే, బాణలికి మూత పెట్టి, మంటను తగ్గించండి. ఇప్పుడు మీ తాజా పాప్‌కార్న్ క్షణాల్లో సిద్ధమవుతుంది.

ఇప్పుడు, ఒక బాణలిలో చక్కెర వేసి లో ప్లేమ్‌లో ఉంచండి.. అది సమానంగా కరిగేలా చూసుకోవడానికి బాణలిని మెల్లగా ఊపండి. పంచదార పూర్తిగా కరిగి బంగారు రంగులోకి మారినప్పుడు, కాస్త వెన్న, బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. బేకింగ్ సోడా క్యారమెల్‌ను తేలికగా, కొద్దిగా నురుగుగా చేస్తుంది, ఇది పాప్‌కార్న్‌పై కరకరలాడే పూతను ఏర్పరుస్తుంది.

ఇప్పుడు మంటను ఆపివేసి, మీరు ముందే చేసి పెట్టుకున్న పాప్‌కార్న్‌ను క్యారమెల్‌లో వేయండి. ప్రతి పాప్‌కార్న్‌కు క్యారమెల్ పూత పట్టేలా బాగా షేక్ చేయండి. తరువాత, దానిని ఒక ప్లేట్ లేదా ట్రేలో వేసి చల్లారనివ్వండి. తర్వాత, పాప్‌కార్న్ ఒకదానికొకటి అంటుకుంటుంది. వాటిని మీ చేతులతో మెల్లగా విడదీయండి. అంతే ఎంతే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే థియేటర్ తరహా క్యారమెల్ పాప్‌కార్న్ రెడీ అయినట్టే.