
పాములు ఇంట్లోకి, పరిసరాల్లోకి రాకుండా చూడటానికి ముందుగా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు, రాళ్ల కుప్పలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి పాములు దాక్కోవడానికి అనువైన ప్రదేశాలుగా మారతాయి. అలాగే ఇళ్లలో ఎలుకల సంచారాన్ని అరికట్టడం ద్వారా పాములను నిరోధించవచ్చు. ఎందుకంటే ఆహారం కోసమే పాములు ఎక్కువగా మనుషులు ఉండే ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇళ్ల తలుపుల కింద ఉండే సందులు, డ్రైనేజీ పైపుల రంధ్రాలను సరిగ్గా మూసివేయడం వల్ల పాములు లోపలికి రాకుండా చూడవచ్చు.

రాత్రి వేళల్లో బయట తిరిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళ బయటకు వెళ్లేటప్పుడు లేదా పొలాల వైపు నడిచేటప్పుడు తప్పనిసరిగా టార్చ్ లైట్ ఉపయోగించాలి. నేలపై కాలినడకన వెళ్లేటప్పుడు కర్రతో నేలను తడుతూ లేదా శబ్దం చేస్తూ నడవడం వల్ల పాములు అప్రమత్తమై దూరంగా జరిగిపోతాయి. ఒకవేళ ఇళ్ల పరిసరాల్లో పాము కనిపిస్తే భయంతో కేకలు వేయడం లేదా దాన్ని చంపడానికి ప్రయత్నించడం చేయకూడదు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

అనుకోకుండా ఎవరికైనా పాము కాటు వేస్తే బాధితుడిని ముందుగా మానసికంగా ధైర్యంగా ఉంచడం అత్యంత ప్రధానమైన పని. భయం వల్ల గుండె వేగంగా కొట్టుకుని శరీరంలో విషం వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. కాటు వేసిన చోట అస్సలు కదల్చకుండా స్థిరంగా ఉంచాలి. బాధితుడు ధరించిన ఉంగరాలు, గడియారాలు, గాజులను వెంటనే తీసివేయాలి, ఎందుకంటే వాపు వస్తే అవి కట్టుకుపోయి రక్తప్రసరణను అడ్డుకుంటాయి.

పాము కాటు వేసినప్పుడు చేయకూడని పొరపాట్ల పట్ల కూడా అవగాహన ఉండాలి. గాయాన్ని బ్లేడుతో కోయడం, నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం లేదా కాటు వేసిన ప్రాంతానికి పైన తాడుతో దారంతో గట్టిగా కట్టడం వంటి పాత పద్ధతులను అస్సలు చేయకూడదు. నాటు వైద్యం లేదా మంత్రాల వద్దకు వెళ్తూ కాలాన్ని వృథా చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

ప్రతి పాము కాటు విషపూరితం కాకపోవచ్చు. కానీ ప్రతి సందర్భాన్ని అత్యవసర పరిస్థితిగానే పరిగణించాలి. కాటు గురైన వ్యక్తిని ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ప్రభుత్వ లేదా నిపుణులు ఉన్న ఆసుపత్రికి తరలించి యాంటీ స్నేక్ వెనమ్ అందించడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చు.