
ఐస్ మ్యాజిక్: మీ ఫ్యాన్ గాలి వేడిగా వస్తుంటే ఒక వెడల్పాటి పాత్రలో లేదా ట్రేలో ఐస్ క్యూబ్స్ తీసుకోండి. దానిని టేబుల్ ఫ్యాన్ ముందు లేదా సీలింగ్ ఫ్యాన్ గాలి తగిలేలా కింద ఉంచండి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ గాలి ఐస్ ముక్కలను తాకి, గదిలోకి చల్లని గాలిని పంపిస్తుంది. ఇది చిన్న గదుల్లో ఏసీ లాంటి అనుభూతిని ఇస్తుంది.

తడి గుడ్డ పద్ధతి: పూర్వ కాలంలో అనుసరించిన ఈ పద్ధతి ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కాటన్ గుడ్డను తడిపి, దానిని ఫ్యాన్ ముందు లేదా గాలి వచ్చే కిటికీ దగ్గర వేలాడదీయండి. గాలి ఆ తేమ గుండా ప్రయాణించినప్పుడు సహజంగానే చల్లబడుతుంది. అలాగే పడుకునే ముందు కాస్త తడి చేసిన దుప్పటిని చుట్టుకున్నా ఫ్యాన్ గాలికి శరీరం చల్లగా ఉంటుంది.

నేలపై నీటిని చిలకరించండి: గదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నేలపై (టైల్స్ లేదా సిమెంట్ ఫ్లోర్ అయితే) కొద్దిగా నీటిని చిలకరించండి లేదా తడి బట్టతో తుడవండి. సీలింగ్‌పై కూడా నీటిని చిలకరించడం వల్ల పైకప్పు వేడి తగ్గి, ఫ్యాన్ నుంచి వచ్చే వేడి గాలి తగ్గుతుంది. గాలిలో తేమ పెరగడం వల్ల ఉష్ణోగ్రత త్వరగా తగ్గుముఖం పడుతుంది.

గాలి ప్రసరణ ముఖ్యం: పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు, కర్టెన్లు పూర్తిగా మూసివేయండి. దీనివల్ల బయటి వేడి గాలి లోపలికి రాదు. సాయంత్రం వేళల్లో బయటి వాతావరణం చల్లబడ్డాక కిటికీలు తెరిచి, బయటి చల్లని గాలి లోపలికి వచ్చేలా ఫ్యాన్ దిశను సర్దుబాటు చేయండి.

ఫ్యాన్ పరిశుభ్రత మరువకండి: చాలామంది ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేయరు. దుమ్ము పేరుకుపోవడం వల్ల ఫ్యాన్ తిరుగుతున్నా గాలి సరిగ్గా రాదు సదా వేడిగా అనిపిస్తుంది. ఫ్యాన్ రెక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల గాలి వేగం పెరుగుతుంది. గది పెద్దదిగా ఉంటే సీలింగ్ ఫ్యాన్‌తో పాటు ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ వాడటం వల్ల గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.