
మన ధరించే వెండి ఆభరణాలు కొన్ని రోజులకే నల్లగా మారిపోతుంటాయి. ఇందుకు కారణం మన శరీరంలోని వేడి అని అందరూ అనుకుంటారు. కానీ గాలిలో ఉండే అతి సూక్ష్మమైన సల్ఫర్ తో వెండి రసాయనిక చర్య జరపడం వల్ల దానిపై సిల్వర్ సల్ఫైడ్ అనే నల్లటి పొర ఏర్పడుతుంది. అయితే ఈ పొరను తొలగించేందుకు వ్యాపారస్థులు పాలిషింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల వెండి అరిగిపోయే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే వీటిని కొత్తవాటిలా మార్చవచ్చు.

అల్యూమినియం ఫాయిల్‌తో మనం ఈజీగా నల్లగా మారిన వెండిని కొత్తవాటిలా మార్చవచ్చు. అవును అల్యూమినియం వెండికంటే వేగంగా చర్య జరుపుతుంది. కాబట్టి వెండి వస్తువులు ఫాయిల్‌ను తాకినప్పుడు, ఎలక్ట్రాన్ల బదిలీ జరిగి వెండిపై ఉన్న సల్ఫర్ నేరుగా అల్యూమినియంపైకి వెళ్తోంది. దీంతో వెండిపై నల్లటి పొర తొలగిపోయి క్షణాల్లో కొత్త దానిలా మారుతుంది.

అల్యూమీనియం ఫాయిల్‌తో వెండిని క్లీన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే.. 1 అల్యూమినియం ఫాయిల్ షీట్, 1 టేబుల్ స్పూన్ వంటసోడా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 నుండి 4 కప్పుల మరిగే వేడి నీరు, ఒక హీట్-సేఫ్ గిన్నె, తుడుచుకోవడానికి మెత్తని కాటన్ గుడ్డ. ఇవి ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే వెండిని కొత్త దానిలా మార్చ వచ్చు.

ఇందుకోసం ముందుగా ఓ గిన్నె తీసుకొని అందులో మెరిసే వైపు కిందకు ఉండే అల్యూమినియం ఫాయిల్‌ను పరవండి. ఇప్పుడు నల్లబడిన వెండి వస్తువులను ఫాయిల్ మీద పెట్టి ప్రతి వస్తువు ఫాయిల్‌కు తగిలేలా ఉంచండి. ఇప్పుడు వాటిపై బేకింగ్ సొడా, ఉప్పును సమానంగా వేయండి.తర్వాత వెండి ఆభరణాలు పూర్తిగా మునిగేంత వరకు మరిగే వేడి నీటిని గిన్నెలో పోయండి. ఇలా పోసిన వెంటనే బుడగలు, తేలికపాటి సల్ఫర్ వాసన వస్తుంది. ఆ వెంటనే వెండికి ఉన్న నలుపు విడిపోయి ఫాయిల్‌పై చేరుతుంది.

ఇప్పుడు ఆభరణాలను బయటకు తీసి మంచినీటితో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత మెత్తని గుడ్డతో తడి లేకుండా తుడుచుకోవాలి. అయితే అనప్పటికీ వెండిపై ఉన్న నల్ల పొర పోకపోతే ఇదే పద్దతిని మరోసారి రిపీట్ చేయండి. అయితే ఇదే పద్దతి ఎందుకు బెస్ట్ అంటే సాధారణ క్లాత్‌తో తుడిచినా లేదా పాలిష్ చేసినా చేరలేని సన్నని నగిషీలు, డిజైన్ల సందుల్లోకి ఈ ద్రావణం సులభంగా చేరుతుంది. కాబట్టి గీతలు పడకుండా, వెండి బరువు తగ్గకుండా సురక్షితంగా, ఈ పద్దతిలో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కొత్తదానిలా మెరిపించుకోవచ్చు.