
ఎండలు ముదురుతున్నాయి. ఉదయం 10 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ మండుటెండల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు, తక్షణ శక్తినిచ్చేందుకు కొబ్బరి నీళ్లకు మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే వేసవిలో వీటికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అయితే, కొన్నిసార్లు మనం ఎక్కువ ధర చెల్లించి కొన్నా, బొండంలో నీరు తక్కువగా వచ్చి నిరాశ కలిగిస్తుంది. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎక్కువ నీరు ఉన్న బోండాన్ని తీసుకోవచ్చు.

బాగా కదిలించి చూడండి: బొండాన్ని కొనే ముందు ఒకసారి చెవి దగ్గర పెట్టుకుని బాగా కదిలించండి. ఒకవేళ కదిలించినప్పుడు లోపల నీరు కదులుతున్నట్లు లబలబ శబ్దం వస్తే, అందులో నీరు తక్కువగా ఉందని, కొబ్బరి కట్టడం ప్రారంభమైందని అర్థం. శబ్దం అస్సలు రాకుండా బరువుగా అనిపిస్తే, అందులో నీరు నిండుగా ఉన్నట్లు లెక్క.

రంగును గమనించండి: బొండం పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటే అది ముదిరిపోయిందని అర్థం. అటువంటి వాటిలో కొబ్బరి ఎక్కువగా, నీరు తక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉండే బొండాలనే ఎంచుకోండి. వీటిలోనే నీరు తీయగా, ఎక్కువగా ఉంటాయి.

పరిమాణం చూసి మోసపోకండి: చాలా మంది పెద్ద బొండాల్లోనే నీరు ఎక్కువగా ఉంటుందని భ్రమిస్తారు. కానీ వాస్తవానికి, మధ్యస్థంగా ఉండి గుండ్రని ఆకారంలో ఉన్న బొండాల్లోనే నీరు అధికంగా ఉండే అవకాశం ఉంది. మీకు కేవలం తీయని నీరు మాత్రమే కావాలంటే లేత బొండాలు ఎంచుకోండి. ఒకవేళ నీటితో పాటు లేత కొబ్బరి కూడా తినాలనుకుంటే కొంచెం రంగు మారిన బొండాలను ఎంచుకోవచ్చు.

కొబ్బరి బొండాన్ని కొట్టిన వెంటనే తాగడం ఉత్తమం. ఎక్కువ సేపు గాలిలో ఉంచితే అందులోని పోషక విలువలు తగ్గిపోయే అవకాశం ఉంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడటంలో, డీహైడ్రేషన్ నుండి రక్షించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.