
కావలసిన పదార్థాలు: 6 ఉడికించిన కోడిగుడ్లు, సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటాలు మిక్సీలో పట్టిన మెత్తటి ప్యూరీ, 1 టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, 1½ నుండి 2 టీస్పూన్ల కారం పొడి లేదా సాంబార్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టీస్పూన్ కసూరి మేథీ, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, గ్రేవీ చిక్కదనానికి సరిపడా నీళ్లు, సుగంధ కొబ్బరి మసాలా పేస్ట్ కోసం: 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, లవంగాలు – 3 నుండి 4, యాలకులు – 2, దాల్చినచెక్క – చిన్న ముక్క

తయారీ విధానం: ఒక గిన్నెలో 6 కోడిగుడ్లను నీళ్లు పోసి మెత్తగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా మిక్సీలో గ్రైండ్ చేసి ప్యూరీ సిద్ధం చేసుకోవాలి.

స్టవ్‌పై వెడల్పాటి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పావు టీస్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించాలి. ఆ తర్వాత 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి కలపాలి. టమాటా గుజ్జు చక్కగా వేగి నూనె పైకి తేలడం ప్రారంభించాక.. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్, కరివేపాకు వేయాలి.

మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కొబ్బరి పేస్ట్‌ను పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ల కారం వేసి మసాలాలు మాడకుండా బాగా కలపాలి. అంచుల వెంట నూనె వదులుతున్న సమయంలో.. గ్రేవీ చిక్కదనానికి తగినట్లుగా సుమారు 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు.. ఉడికించిన కోడిగుడ్లకు చాకుతో నాలుగు వైపులా నిలువుగా గాట్లు పెట్టి షేర్వాలో వేయాలి. ఇందులోనే చీల్చిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి.

మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించి మూతపెట్టి 8 నుండి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా నిదానంగా మరగడం వల్ల గుడ్ల లోపలికి మసాలా, కారం బాగా ఇంకి.. గ్రేవీ పైకి ఎర్రటి నూనె తేలుతుంది. చివరగా చేత్తో నలిపిన 1 టీస్పూన్ కసూరి మేథీ, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ 'ఎగ్ షేర్వా' సిద్ధం! ఘుమఘుమలాడే బిర్యానీ, బగారా రైస్, పులావ్లలోకైనా లేదా వేడివేడి చపాతీ, రోటీ, పరోటాల్లోకైనా ఈ షేర్వా పోసుకుని గుడ్డును తుంచుకుని తింటుంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత అద్భుతమైన రుచినిస్తుంది!