
చిన్న పిల్లల కోసం తల్లులుల ఏదో ఒక రిసిపీ ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా స్వీట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ బయట దొరికే వాటిని కొనివ్వడం కంటే ఇంటిలోనే చాలా సింపుల్‌గా ఇలా స్వీట్ బజ్జీలు చేసి పెడితే చాలు, చాలా ఇష్టంగా కడుపు నిండుగా తింటారు. మరి ఇప్పుడు మనం ఆ స్వీట్ బజ్జీలను ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. గోధుమ పిండి, చక్కెర, నీరు. కప్పు గోధుమ పిండి తీసుకుంటే అర కప్పు చక్కెర తీసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా ఉపయోగించ వచ్చును. ఈ సింపుల్ పదార్థాలతో చక్కెర బజ్జీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. తర్వాత అందులోకి మీరు ఎంత పిండి అయితే తీసుకున్నారో దానికి సరిపడ చక్కెరను తీసుకోవాలి. తర్వాత నీరు పోసి పిండి మంచిగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలిపితే బజ్జీలు అంత టేస్టీగా వస్తాయి.

అచ్చం బోండాలు వేసే పిండిలా ఈ పిడిని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. దీని వలన బజ్జీలు మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్నగా బోండాల్లా బజ్జీలు వేసుసుకోవాలి. కాలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చక్కెర బజ్జీలు రెడీ.