
కావలసిన పదార్థాలు: కందిపప్పు అర కప్పు, ఉసిరికాయలు 6, నీళ్లు 3 కప్పులు, పచ్చిమిర్చి 9, పసుపు అర టీస్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, మెంతులు 2 చిటికెలు, ఆవాలు 1 టీస్పూన్, ఎండుమిర్చి 2, పచ్చి శనగపప్పు 1 టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, కరివేపాకు 3 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ తరుగు అర కప్పు, పండిన టమాటాలు 2, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా.

ముందుగా అర కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, ఆరు ఉసిరికాయలు వేసి మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. ఉసిరికాయలు మరీ గుజ్జుగా కాకుండా ఫోర్క్ గుచ్చితే లోపలికి దిగేంత వరకు మెత్తబడితే సరిపోతుంది. ఉడికిన ఉసిరికాయలను పక్కకు తీసి చల్లారనివ్వాలి; అయితే అవి ఉడికించిన నీటిని పారబోయకుండా పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు, పావు టీస్పూన్ పసుపు, నిలువుగా చీల్చిన రెండు పచ్చిమిర్చి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ లోపు చల్లారిన ఉసిరికాయల నుండి గింజలు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను, కారానికి సరిపడా ఐదారు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి.

తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత చిటికెడు మెంతులు వేసి ఎర్రగా వేయించి, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేంత వరకు వేయించి, పండిన టమాటా ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటాలు మగ్గేవరకు ఉడికించాలి. అనంతరం మెత్తగా ఉడికించిన కందిపప్పు వేసి కలిపి రెండు మూడు పొంగులు రానివ్వాలి. చివరగా రుబ్బుకున్న ఉసిరికాయ ముద్ద, పక్కన పెట్టుకున్న ఉసిరికాయ నీరు పోసి మూతపెట్టి కాసేపు మగ్గించాలి. ఉసిరికాయ సారం అంతా పప్పులోకి దిగిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పప్పు సిద్ధం.