
అటుకుల లడ్డు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే మనం చాలా త్వరగా టేస్టీగా అటుకుల లడ్డును ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. లావు అటుకులు 2 కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు 1/4 కప్పు , యాలకులు - 3-4, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు , బాదం పప్పు పలుకులు - 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు - 1 టేబుల్ స్పూన్, బెల్లం - 3/4 కప్పు, కాచిన పాలు - 3/4 కప్పు.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా, రెండు కప్పుల లావు అటుకులను తీసుకోవాలి. తర్వాత మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి, అటుకులను అందులో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అటుకులు క్రిస్పీగా మారేవరకు నిరంతరం కలుపుతూ బాగా వేయించాలి. తర్వాత వేగిన అటుకులను ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచాలి.

అదే కడాయిలోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను తీసుకుని, రెండు మూడు నిమిషాలు వేయించాలి. వేయించిన కొబ్బరిని మిక్సీ జార్‌లోకి తీసుకుని, అందులో మూడు నాలుగు యాలకులను చేర్చాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేయడం వల్ల అటుకులతో కలిపి గ్రైండ్ చేసినప్పుడు బాగా నలుగుతుంది.

ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న అటుకులను కొబ్బరి మిశ్రమంలో చేర్చి, మెత్తగా లేదా మీకు నచ్చిన బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని వేడి చేయాలి. నెయ్యి వేడి అయ్యాక, కట్ చేసిన బాదం పప్పు పలుకులు , జీడిపప్పు పలుకులను వేసి, అవి కాస్త ఎర్రగా మారేవరకు కలుపుతూ వేయించాలి. వేగిన డ్రై ఫ్రూట్స్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, కడాయిలోకి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు నిరంతరం కలుపుతూ కరిగించాలి.

బెల్లం పూర్తిగా కరిగిపోయాక, గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కరిగిన బెల్లంలో వేసి బాగా కలపాలి. ఎక్కడైనా ముద్దలు ఉన్నట్లు అనిపిస్తే, వాటిని స్పూన్‌తో నొక్కుతూ కలపాలి. ఇప్పుడు అర కప్పు నుండి ముప్పావు కప్పు వరకు కాచిన పాలను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. పాలను ఒకేసారి వేయకుండా, ఇలా కొద్దికొద్దిగా వేస్తూ కలిపితే అటుకులకు బాగా పట్టి, మిశ్రమం సాఫ్ట్‌గా మారుతుంది. మిశ్రమం పాన్‌కు లైట్‌గా అంటుకునేంత వరకు కలుపుతూ ఒకటి రెండు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి, వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే, పై నుండి ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి మళ్లీ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని, గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులుగా చుట్టుకోవాలి. అంతే అటుకుల లడ్డూలు రెడీ.