
కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసల మొలకలు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల ఎండు కొబ్బరి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, రుచికి తగినంత కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 చెంచాల వంట నూనె. గమనిక: ఈ రెసిపీకి చింతపండు అస్సలు అవసరం లేదు

తయారీ విధానం: స్టవ్పై బాండీ పెట్టి 2-3 చెంచాల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత 2 చెంచాల పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా మారే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నూనెలో కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

అదే బాండీలోకి మొలకలు వచ్చిన పెసలను వేయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ నిదానంగా ఎక్కువసేపు వేయించాలి . మొలకలలో ఉండే చెమ్మ పూర్తిగా ఆవిరైపోయి, అవి చక్కగా క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఇలా వేయించకపోతే పొడి వాసన వచ్చేస్తుంది. మొలకలు క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి మీదే ఒక చెంచా జీలకర్ర వేయాలి. ఆ బాండీ వేడికే జీలకర్ర చక్కగా వేగిపోతుంది. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించిన పెసల మొలకలు, జీలకర్ర వేయాలి. ఇందులోనే ముందుగా వేయించి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు, పల్లీలు, కరివేపాకు మరియు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారానికి తగినంత కారం పొడి వేసి మరీ మెత్తటి పిండిలా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసిన కారప్పొడిని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఇది 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'పెసల మొలకల కారప్పొడి' సిద్ధం. పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ కారప్పొడి వేసి, స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని తింటే అద్భుతమైన రుచితో పాటు శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయి!