
మెంతికూర పరాటా: మెంతికూర పరాటా తయారీకి గోధుమ పిండిలో సన్నగా తరిగిన మెంతికూర, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె కలిపి పిండిలా కలుపుకోవాలి. పిండిని నానబెట్టి, ఆ తర్వాత మధ్యస్థంగా కాస్త మందంగా ఉండేలా పరాటాలను ఒత్తుకోవాలి. తర్వాత నూనె లేదా బటర్‌తో మంచిగా అన్ని వైపులా కాల్చుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పాలకూర పరాటా: పాలకూర పరాటా కోసం ముందుగా వేడి నీళ్లలో పాలకూరను ఉడికించాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, వాము, ఉప్పుతో కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను గోధుమ పిండిలో కలిపి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తటి పిండిని సిద్ధం చేసుకోవాలి. పిండిని నానబెట్టిన తర్వాత పరాటాలను ఒత్తుకుని కాల్చుకోవాలి. పాలకూర వల్ల పరాటాకి మంచి రంగు, పోషకాలు లభిస్తాయి.

మసాలా పరాటా: ఈ పరాటా తయారీకి గోధుమ పిండిలో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, వాము, గరం మసాలా లేదా చాట్ మసాలా, ఆంచూర్ పౌడర్, కసూరి మేతి, వెల్లుల్లి, బటర్ కలిపి పిండిని కలుపుకోవాలి. ఈ పరాటాలో స్టఫింగ్ అవసరం లేకుండానే అన్ని రకాల మసాలాలు రుచిని పెంచుతాయి. మసాలా ప్రియులకు ఇది చక్కటి ఎంపిక.

టమాటో పరాటా: టమాటో పరాటా కోసం, గోధుమ పిండిలో ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, మెత్తగా రుబ్బుకున్న టమాటో పేస్ట్ కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి మృదువైన పిండిని తయారుచేసుకోవాలి. టమాటో రుచి పరాటాకి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

ఆలూ పరాటా : ఉడికించిన బంగాళదుంపలను పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, వాము, అల్లంపచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, ఆంచూర్ పౌడర్, పెరుగుతో కలిపి పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ పరాటా రుచిలో స్టఫింగ్ ఆలూ పరాటాకు ఏ మాత్రం తీసిపోదు.