
చలికాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ లడ్డు గోందు లడ్డు. ఇది కేవలం రుచికరమైన మిఠాయి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. గోందు లడ్డు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలు మరియు కీళ్ళను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి, అలాగే బాలింతలకు ఇది అద్భుతమైన పోషకాహారం.

తయారీలోకి వెళ్లితే..ఒక మందపాటి కడాయిలో ఒకటి లేదా రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక, అరకప్పుగోందుని సగం సగం మీడియం మంటపై వేయించాలి. గోందు సగ్గుబియ్యంలా పొంగి, చక్కగా వేగితేనే లడ్డు తినేటప్పుడు పంటికి అతుక్కోదు. వేగిన గోందును ఒక ప్లేట్‌లోకి తీసుకోండి.

అదే కడాయిలో మరో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు పూల్ మఖానాను క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి, 2 టేబుల్‌స్పూన్ల బాదం, 2 టేబుల్‌స్పూన్ల బాదం, జీడిపప్పు, 2 టేబుల్‌స్పూన్ల పిస్తా వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. చివరిగా, అరకప్పు నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించి, అరకప్పు నుంచి ముప్పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు రోస్ట్ చేయాలి. ఈ వేయించిన పదార్థాలన్నింటినీ గోందు ఉన్న ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.

మిగిలిన ముప్పావు కప్పు నెయ్యిని కడాయిలో వేడి చేసి, రెండు కప్పుల మల్టీగ్రెయిన్ గోధుమపిండిని వేయాలి. మంచిగా వేయించుకోవాలి. వేగిన పిండిని మూతపెట్టి పక్కన ఉంచండి. తర్వాత మిక్సీ జార్‌లో 4 ఇలాచీ, 1 టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ సొంటి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత వేయించిన గోందును వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. అదేవిధంగా పూల్ మఖానాను కూడా బరకగా గ్రైండ్ చేసి బౌల్‌లో వేయాలి. అనంతరం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గ్రైండ్ చేసి బౌల్‌లో కలపాలి.

ఇదే మిక్సీ జార్‌లో ఒకటి ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్‌లోకి కలపాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా ఈ మిశ్రమంలో వేయాలి. ఇందులోనే పావు కప్పు వేయించి, చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి అన్నింటినీ బాగా కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గోందు లడ్డు రెడీ.