
కావలసిన పదార్థాలు: 1 కప్పు దాల్చినచెక్క, 1 కప్పు ధనియాలు, 1 కప్పు సోంపు గింజలు, అర కప్పు నల్ల జీలకర్ర, అర కప్పు జీలకర్ర, 1 టీస్పూన్ తాజా అల్లం తురుము లేదా ఎండబెట్టిన సొంటి పొడి, 1 టీస్పూన్ పచ్చి పసుపు తురుము, 1 నుండి 2 గ్లాసుల నీళ్లు. గమనిక: గర్భిణీ స్త్రీలు తప్ప మిగతా అందరూ ఈ హెర్బల్ డ్రింక్‌ను నిరభ్యంతరంగా తాగవచ్చు

తయారీ విధానం: స్టవ్‌పై వెడల్పాటి పాన్ పెట్టి దాల్చినచెక్క ముక్కలు, ధనియాలు, సోంపు, కలౌంజీ, జీలకర్ర మరియు వాము వేయాలి. మంటను పూర్తిగా సిమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ గింజలు మాడిపోకుండా చిటపటలాడే వరకు దోరగా వేయించాలి. వేగిన గింజల మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎయిర్‌టైట్ గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది . హాస్టల్‌లో ఉండేవారు లేదా ఆఫీసులకు వెళ్లేవారు దీనిని మిక్సీలో మెత్తటి పౌడర్‌లా చేసుకుని వేడి నీళ్లలో కలుపుకోవచ్చు.

తాజా అల్లం, పచ్చి పసుపు కొమ్ములను శుభ్రంగా కడిగి పై పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి లేదా రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోజువారీ శ్రమ తగ్గించుకోవాలనుకుంటే అల్లం, పసుపును తురిమి ఎండబెట్టి పౌడర్‌లా చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల మంచి నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. ఇందులో దంచి పెట్టుకున్న అల్లం-పసుపు పేస్ట్ వేయాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న హెర్బల్ సీడ్స్ మిశ్రమంలోంచి 1 టేబుల్ స్పూన్ గింజలను లేదా దంచిన పొడిని నీటిలో వేయాలి.

మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దినుసులలోని ఔషధ గుణాలు, రంగు నీటిలోకి దిగి గోల్డెన్ రంగులోకి మారే వరకు 5 నుండి 7 నిమిషాలు బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. టీ స్ట్రైనర్ సహాయంతో గోల్డెన్ వాటర్‌ను గ్లాసులోకి వడకట్టుకోవాలి. అంతే, నోరూరించే సువాసనతో కూడిన 'గోల్డెన్ వాటర్' సిద్ధం! ఈ హెర్బల్ డ్రింక్‌ను గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజూ ఉదయం పరగడుపున కానీ, లేదా రాత్రి నిద్రపోయే ముందు కానీ క్రమం తప్పకుండా తాగితే పొట్ట చుట్టూ కొవ్వు కరిగి శరీరం తేలికపడుతుండటాన్ని స్పష్టంగా గమనించవచ్చు!