
కావలసిన పదార్థాలు: 2 నుండి 3 కట్టల తాజా గోంగూర, 3 గంటలు నానబెట్టిన 50 గ్రాముల పచ్చి శనగపప్పు, ముక్కలుగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, చిన్న రెబ్బ చింతపండు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 1 చిటికెడు ఇంగువ పొడి, 4 రెమ్మల తాజా కరివేపాకు

తయారీ విధానం: 50 గ్రాముల పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు పోసి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. గోంగూర ఆకులను ముదురు కాడలు లేకుండా తుంచి.. మట్టి లేకుండా నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక లోతైన పాత్రలోకి తీసుకోవాలి. గోంగూర ఉన్న పాత్రలోకి 2 కట్ చేసిన టమాటాలు, 1 కట్ చేసిన ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, చిన్న చింతపండు రెబ్బ వేయాలి.ఇందులోనే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 3 గంటలు నానబెట్టిన పచ్చి శనగపప్పును నీళ్లు వడకట్టి వేయాలి.

ఈ కూరగాయలు ఉడకడానికి సరిపడా 1 చిన్న చెంబుడు నీళ్లు పోయాలి. మూతపెట్టి స్టవ్‌పై పెట్టి మీడియం మంటపై 6 నుండి 8 నిమిషాలు ఉడికించాలి. శనగపప్పు 60 నుండి 70 శాతం మాత్రమే ఉడికినట్లు చూసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. గిన్నెను కిందకు దించి పప్పుగుత్తితో గోంగూర, టమాటాలు, పచ్చిమిర్చిని మాత్రమే బాగా మెత్తగా ఎనపాలి. శనగపప్పు గింజలు నలగకుండా అలాగే ఉండేలా చూసుకోవాలి. కొద్దిగా అర గ్లాసు నీళ్లు పోసి గరిటెతో బాగా తిప్పి పక్కన ఉంచుకోవాలి.

స్టవ్‌పై వెడల్పాటి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో సన్నగా పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఇంగువ పొడి వేసి ఉల్లిపాయలు లేత గులాబీ రంగులోకి వచ్చే వరకు వేపాలి. ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి.

తాలింపు చక్కగా వేగిన తర్వాత.. ముందుగా ఎనిపి ఉంచుకున్న గోంగూర-శనగపప్పు మిశ్రమాన్ని కడాయిలోకి పోసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకుని మూతపెట్టాలి. మీడియం మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు కూర తుకతుక ఉడికేంత వరకు మగ్గించాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లి.. ఉప్పు సరిపోయిందో లేదో చేతిలో వేసుకుని రుచి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే, నోరూరించే ఫంక్షన్ స్టైల్ 'గోంగూర శనగపప్పు కూర' సిద్ధం! వేడివేడి వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పులావ్, బగారా అన్నం లేదా చపాతీల్లోకి ఈ పుల్లపుల్లని గోంగూర గ్రేవీని నంజుకుని తింటుంటే.. శనగపప్పు క్రంచీగా తగులుతూ పెళ్లిళ్ల భోజన పంక్తిలో తిన్న అద్భుతమైన అనుభూతినిస్తుంది!