
సేమియా పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. సగ్గుబియ్యం: పావు కప్పు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్: 1 టేబుల్ స్పూన్, సేమ్యా: ముప్పావు కప్పు, నీళ్లు: 1 కప్పు, పాలు: 3 కప్పులు, పంచదార: ముప్పావు కప్పు, యాలకుల పొడి: అర టీ స్పూన్, కుంకుమపువ్వు , ఉప్పు: చిటికెడు, మరిగించిన పాలు

తయారీలోకి వెళ్లితే.. ముందుగా పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి, మాడిపోకుండా బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

తర్వాత అదే పాన్ లోకి ముప్పావు కప్పు సేమ్యాను వేసి, నెయ్యిలో దోరగా వేయించాలి. ఇది కూడా మంచి రంగు వచ్చేవరకు వేయించి, వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ సేమ్యా, సగ్గుబియ్యం మొత్తం ఒక కప్పుకు సరిపోతాయి. ఇప్పుడు అదే పాన్ లోకి ఒక కప్పు నీళ్లు పోసి, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేయాలి. మీడియం మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికి పైకి తేలాలి.

సగ్గుబియ్యం ఉడికిన తర్వాత, మూడు కప్పుల కాగబెట్టి చల్లార్చిన పాలను వేయాలి. పచ్చి పాలు కూడా ఉపయోగించవచ్చు. పాలు పొంగు వచ్చేంతవరకు మరిగించాలి, మీగడ కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. పాలు పొంగు వస్తున్నప్పుడు, వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా మొత్తాన్ని అందులో వేయాలి.

మీడియం మంటపై సేమ్యాను కలుపుతూ ఉడికించాలి. సేమ్యా ఉడికిన తర్వాత ముప్పావు కప్పు పంచదార వేసి, మీడియం మంటపై కలుపుతూ పూర్తిగా కరిగించాలి. పంచదార కరిగిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించడం వల్ల పాయసం కాస్త చిక్కబడుతుంది.ఇప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు ,ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ను పాయసంలో వేసి కలపాలి. అంతే టేస్టీ టేస్టీ పాయసం రెడీ.