
పుచ్చకాయ కూర: పుచ్చకాయ కర్రీ చేసుకునేందుకు పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగాన్ని చిన్న ముక్కలుగా కోసి.. ఆలుగడ్డ, టమోటా, మసాలాలతో కలిపి వండుకోవచ్చు. ఇది కొంచెం తీపి, కొంచెం కారంగా ఉండి, అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది.

పుచ్చకాయ తొక్క పచ్చడి: మీకు పచ్చళ్లు ఇష్టమైతే, పుచ్చకాయ తొక్కలతో పచ్చడి ట్రై చేయండి. తొక్కలను ఉడికించి పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు లేదా నిమ్మరసంతో కలిపి గ్రైండ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది దోశలు, ఇడ్లీలు లేదా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

ఊరగాయ: మామిడికాయ ఊరగాయ లాగే, పుచ్చకాయ తొక్కలతో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చని చాలా మందికి తెలియదు. దీన్ని చేసుకోవానికి ముందుగా పుచ్చకాయ తొక్కను ముక్కలుగా కట్‌చేసి వాటికి ఉప్పు, కారం, నూనె, ఆవపిండి కలిపి ఎండలో పెడితే, కొన్ని రోజుల్లోనే మంచి రుచికరమైన ఊరగాయ సిద్ధమవుతుంది.

స్వీట్ హల్వా: పిల్లల కోసం ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే, పుచ్చకాయ తొక్కల హల్వా ఉత్తమమైనది. ఇది తయారు చేసేందుకు తొక్కలను చిన్నగా తురిమి పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి ఉడికిస్తే కమ్మని హల్వా రెడీ అవుతుంది.

జ్యూస్: పుచ్చకాయ తొక్కలతో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. వీటిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ తొక్కలను పడేయకుండా ఇలా చేయడం వల్ల మనం ఆహారాన్ని వృథా చేయకుండా, పర్యావరణానికి కూడా మేలు చేసినవారమవుతాము.