
ఈ రోజుల్లో పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ కోసం లేదా శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం విభిన్న రకాల హెల్త్ డ్రింక్స్ తాగడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇందులో భాగంగానే మెజారిటీ ప్రజలు గోరువెచ్చని నిమ్మరసం నీళ్లను రోజూ తీసుకుంటున్నారు. కానీ నిమ్మరసం తాగడం వల్ల మాత్రమే పొట్ట కొవ్వు మంచులా కరిగిపోతుందనే ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో, అది కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాన్ని ప్రముఖ హాస్పిటల్ కన్సల్టెంట్ డైటెటిక్స్ డైటీషియన్ రిచా శర్మ వివరించారు.

డైటీషియన్ రిచా శర్మ సమాచారం ప్రకారం.. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మాత్రమే పొట్ట కొవ్వు తగ్గదు. నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల ప్రత్యేకంగా కడుపు భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. మన శరీరంలో ఒకే నిర్దిష్ట ప్రాంతంలో కొవ్వును కరిగించే అద్భుత శక్తి ఏ ఒక్క పానీయానికి లేదా ఆహార పదార్ధానికి ఉండదని, బరువు తగ్గినప్పుడు శరీరం మొత్తంలో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని దీని అర్థం కాదు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక నిమ్మకాయలో సుమారు 30 నుండి 40 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది మీ రోజువారీ విటమిన్ సి అవసరాలను తీర్చడానికి సులభమైన మార్గం. అంతేకాకుండా మార్కెట్లో దొరికే కృత్రిమ చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్, స్వీట్ టీ లేదా ఇతర క్యాలరీలు ఎక్కువ ఉండే పానీయాలకు బదులుగా నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల శరీరానికి అందే రోజువారీ కేలరీల వినియోగం తగ్గుతుంది. ఇది కాలక్రమేణా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

అంతేకాకుండా నిమ్మరసం నీళ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపించి, అనవసరమైన ఆహార కోరికలు తగ్గుతాయి. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ బరువు తగ్గడం లేదా పొట్ట తగ్గడం అనేది కేవలం నిమ్మకాయ ప్రభావం వల్ల మాత్రమే జరగడం లేదు. దాని వల్ల శరీరంలో క్యాలరీల శాతం తగ్గడం, హైడ్రేషన్ పెరగడం వల్లనే ఈ మార్పు సాధ్యమవుతుంది.

కేవలం ఒక డ్రింక్ లేదా ఇంటి చిట్కాతో పొట్ట కొవ్వును పూర్తిగా తగ్గించడం అసాధ్యం. మీ శరీర ఆకృతిని మెరుగుపరుచుకోవడానికి, పొట్ట కొవ్వును ఆరోగ్యకరంగా తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం, రోజువారీ శారీరక శ్రమ, దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఎంతో అవసరమని డైటీషియన్లు సూచిస్తున్నారు. మీకు నిమ్మరసం తాగడం ఇష్టమైతే, దానిని ఒక మంచి అలవాటుగా దినచర్యలో భాగం చేసుకోవచ్చు కానీ బరువు తగ్గడానికి దానినే ఒక అద్భుత ఔషధంగా లేదా మందుగా భావించవద్దు.