
చక్కెర, పాలు, నూనె, నెయ్యి లేకుండా చాలా సులభంగా స్వీట్ తయారు చేయవచ్చునంట. దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా నిశ్చయంగా తినవచ్చును. కాగా, మనం ఇప్పుడు కొబ్బరి అటుకుల స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. కొబ్బరి కాయ: 1 (చిక్కటి కొబ్బరి పాలు 2.5 నుండి 3 కప్పులు వచ్చేలా), పల్లీలు: 1/4 కప్పు, అటుకులు : 3/4 కప్పు, బెల్లం తురుము: 1.25 కప్పులు , నీళ్లు: 3/4 కప్పు , 1/4 కప్పు, యాలకుల పొడి: 1/2 టీస్పూన్, ఉప్పు: చిటికెడు.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా, ఒక కొబ్బరి కాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీజార్‌లో వేసి నీరు పోసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకొని , కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో పావు కప్పు పల్లీలను వేయించి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ముప్పావు కప్పు లావు అటుకులనుఅర నిమిషం పాటు సిమ్ మంటపై వేయించండి. అటుకుల రంగు మారకుండా, క్రిస్పీగా మారితే సరిపోతుంది. పల్లీలు, అటుకులు రెండూ పూర్తిగా చల్లారిన తర్వాత, ముందుగా అటుకులను మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలలో, అటుకుల పొడి, పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. గరిటెతో బాగా కలిపి, గడ్డలు ఏమైనా ఉంటే మ్యాష్ చేయండి. మొదట పల్చగా అనిపించినా, కొద్దిసేపటికి చిక్కబడుతుంది.ఒక నాన్-స్టిక్ కడాయిలో ఒకటింపావు కప్పు బెల్లం తురుమును, పావు కప్పు నీళ్లను వేసి స్టవ్ ఆన్ చేయండి. బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపి, పాకాన్ని వడపోసుకోండి. ఇలా చేయడం వలన బెల్లంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి.

ఇప్పుడు అదే కడాయిని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి, వడపోసిన బెల్లం పాకాన్ని మళ్లీ వేడి చేయండి. మంటను సిమ్‌లో ఉంచి, కొబ్బరి పాలు, అటుకులు, పల్లీల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ నిరంతరం కలుపుతూ ఉండాలి. గడ్డలు కట్టకుండా చూసుకోండి. మిశ్రమం కలిసిన తర్వాత మంటను హై ఫ్లేమ్‌కు మార్చి,కలపాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి, మరో నిమిషం పాటు ఉడికించండి.

తయారైన మిశ్రమాన్ని ఒక ప్లేట్ లేదా ట్రేలోకి తీసుకోండి. నెయ్యి లేదా నూనె పూయాల్సిన అవసరం లేదు. పూర్తిగా చల్లారిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుంటే, నోరూరించే, ఆరోగ్యకరమైన దీపావళి స్పెషల్ స్వీట్ సిద్ధం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి