
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఏడో రోజు భారత ఆటగాళ్లు అదరగొట్టారు. బాక్సింగ్‌ఈవెంట్‌లో అమిత్ పంఘల్, జాస్మిన్ తదితరులు భారత్‌కు పతకాలు సాధించిపెట్టారు. ఇతర ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు సత్తాచాటారు. 8వ రోజు అభిమానుల ఆశలన్నీ కుస్తీ వీరుల (రెజ్లర్లు) పైనే. వీరితో పాటు నేడు (ఆగస్టు5) అదృష్టం పరీక్షించుకోనున్న భారత క్రీడాకారులెవరో ఒకసారి తెలుసుకుందాం రండి

పారా టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో, భారతదేశానికి చెందిన రాజ్ అరవిందన్ అళగర్ 3-5 క్లాస్‌లో సెమీ-ఫైనల్‌లో తమ అదృష్టం పరీక్షించుకోనుననారు. మహిళల పారా టేబుల్ టెన్నిస్‌లో టోక్యో పారాలింపిక్ పతక విజేత భావినా పటేల్, మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన సూ బెయిలీతో తలపడగా.. అదే విభాగంలో సోనాబెన్ మనుభాయ్ పటేల్ క్రిస్టియన్ ఇకెపాయోయ్‌తో తలపడనుంది. టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇక రెజ్లింగ్‌లో అందరి దృష్టి బజరంగ్ పునియాపైనే ఉంటుంది. అతను 65 కిలోల బరువు విభాగంలో తలపడనున్నాడు. అదేవిధంగా దీపక్ పునియా 86 కేజీల విభాగంలో, మోహిత్ గ్రేవాల్ 125 కేజీల కేటగిరీలో పోటీపడనున్నారు. మహిళల విభాగంలో అన్షు మాలిక్ 57 కేజీల విభాగంలో, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ 62 కేజీల విభాగంలో, దివ్య కక్రాన్ 68 కేజీల విభాగంలో సవాళ్లు ఎదుర్కోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కుస్తీ పోటీలు ప్రారంభమవుతాయి

బ్యాడ్మింటన్‌లో కిదాంబి శ్రీకాంత్ సింగిల్స్ విభాగంలో రౌండ్-16లోకి తలపడనున్నాడు. పీవీ సింధు చివరి-16 మ్యాచ్‌లో ఉగాండాకు చెందిన హుసినా కొబుగాబేతో ఆడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయి రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆడనుంది. మహిళల డబుల్స్‌లో జాలీ త్రిష-గాయత్రి గోపీచంద్ జోడీ మారిషస్‌కు చెందిన జెమీమా-మునగ్రహ గణేష్‌తో తలపడనుంది. బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి.

అథ్లెటిక్స్‌లో జ్యోతి యారాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:07 గంటలకు పురుషుల 4x400 మీటర్ల ఈవెంట్‌లో అమోజ్ జాకబ్, నిర్మల్ టామ్, ఆరోకియా రాజీవ్, మహ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేష్ రమేష్ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక మహిళల 200 మీటర్ల రేసులో హిమ దాస్ సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈ ఈవెంట్ మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభంకానుంది.

సాయంత్రం 4:30 గంటలకు టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా, దియా పరాగ్ చుంగ్ రెహాన్ మరియు స్పైసర్ కేథరిన్‌లతో తలపడతారు. ఇది రౌండ్-32 మ్యాచ్. సాయంత్రం 5 గంటలకు, మహిళల డబుల్స్ రౌండ్ 32లో శ్రీజ అకుల, టెన్నిసన్ రీత్ జోడీ ఎలియట్ లూసీ, ప్లీస్టో రెబెక్కా జంటతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిన్ లూతో ఆచంట శరత్ కమల్ తలపడనున్నాడు. సనీల్ శెట్టి కూడా సాయంత్రం 5:45 గంటలకు ఘనా ఆటగాడు డెరెక్ అగ్రెఫాతో పోటీపడతాడు.

భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అర్ధరాత్రి జరగనుంది. ఇక లాన్ బాల్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.