
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్ చరిత్ర సృష్టించింది. ఆమె త్వరలోనే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొననుంది. తద్వారా ఈ లీగ్‌లో ఆడనున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా శ్రేయాంక అరుదైన రికార్డు ఖాతాలో వేసుకోనుంది.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున శ్రేయాంక ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ జెర్సీతో బరిలోకి దిగిన ఆమె ఇప్పుడు విదేశీ లీగ్‌లో సంతకం చేసిన మొదటి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

గత నెలలో జరిగిన ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్‌లో పాటిల్ 2 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో అదరగొట్టింది. ఇప్పుడు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ జట్టులో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనుంది.

భారత మహిళా క్రికెటర్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్జ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లకు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతించింది. అయితే భారత జట్టుకు ఆడకుండా తొలిసారి విదేశీ లీగ్‌లో ఆడుతోంది శ్రేయాంకా పాటిల్

ఈ ఏడాది బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తలపడుతున్నాయి. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, భారతదేశానికి చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.