టీమిండియాలో కొందరు ఆటగాళ్లు టెస్టులకు తప్పితే.. వన్డేలు, టీ20లకు పనిరారని ఓ ముద్ర వేశారు. అలాగే అటు టెస్టులు, వన్డేలు.. ఇటు టీ20ల్లో.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ రఫ్ఫాడించే ఆటగాళ్లు కూడా తక్కువే. కానీ ఇక్కడ ఎవరైతే టెస్టులకు తప్ప.. టీ20లకు పనికిరారన్నారో.. ఆ ప్లేయర్స్ ఇప్పుడు ఐపీఎల్‌లో దంచికొడుతున్నారు. వారెవరో తెలుసుకుందామా..?
అజింక్య రహానే: గత కొన్ని సంవత్సరాలుగా కేవలం టెస్టు జట్టులోనే చోటు దక్కించుకుంటున్న రహనే.. ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రహానే 44.80 సగటుతో 189.83 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
ఇషాంత్ శర్మ: ఇషాంత్ శర్మ 2021 నుంచి టీమిండియా జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. టెస్టులు మాత్రమే కాదు.. టీ20లు, వన్డేల్లో కూడా ఈ ఆటగాడు ఏ సిరీస్‌లోనూ చోటు దక్కిన్చుకోలేదు. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ 6.50 ఎకానమీతో 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఇప్పటిదాకా తన బౌలింగ్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టనివ్వలేదు.
రవిచంద్రన్ అశ్విన్: టీమిండియా తరపున టెస్టుల్లో మాత్రమే భాగమవుతూ వస్తోన్న రవిచంద్రన్ అశ్విన్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో దంచికొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతోన్న అశ్విన్.. ఇప్పటివరకు 7.22 ఎకానమీతో 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. దీనితో పాటు బ్యాట్‌తో 65 పరుగులు కూడా చేశాడు.
మహ్మద్ షమీ: మహమ్మద్ షమీ.. టీమిండియాలో ఓ కీలక సభ్యుడు. అయితే టీ20, వన్డే ఫార్మాట్లలలో నిలకడగా రాణిస్తూ.. టెస్టుల్లో ప్రధాన బౌలర్‌గా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతోన్న షమీ.. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో 7.06 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. అలాగే పర్పుల్ క్యాప్ కూడా ప్రస్తుతం షమీకి సొంతం.