
IPL 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా కొంతమంది కొత్త ఆటగాళ్ళు తమదైన ముద్ర వేశారు. సహజంగానే ఇలాంటి కొత్త ఆటగాళ్లకు టీమ్ ఇండియాలో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈసారి అది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. అలాంటి అతికొద్ది మంది కొత్త ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన 19 ఏళ్ల తిలక్ వర్మ ఒకరు.

యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ IPL 2022లో ముంబై తరపున తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందుకే అతను త్వరలో ముంబైకి బదులుగా టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియాలో తిలక్ వర్మ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ కోసం, కెప్టెన్ రోహిత్ శర్మతో సహా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతిలో ఉండనున్నారు. దీని కారణంగా కొంతమందికి అవకాశాలు దక్కనున్నాయి.

తిలక్ వర్మ 2020 అండర్-19 ప్రపంచ కప్‌లో తనదైన ముద్ర వేశాడు. అయితే ఈ సీజన్‌లో అతనికి ఐపీఎల్‌లో మొదటి అవకాశం లభించింది. మెగా వేలంలో హైదరాబాద్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను ముంబై రూ. 1.70 కోట్లకు బిడ్డింగ్ చేసి కొనుగోలు చేసింది.

ఈ బ్యాడ్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున తిలక్ వర్మ ఒక్కడే మెరుపులు మెరిపించాడు. జట్టు తరపున 12 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 368 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా, తిలక్ రాబోయే కాలంలో మూడు ఫార్మాట్లలో భారత్‌కు ఆడే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ ఫార్మాట్లలో ఒకదానిలో ప్రవేశం వచ్చే నెలలో జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.