
క్రీడా ప్రపంచంలో ద్యుతీ పేరు తెలియని వారుండరు. ట్రాక్ ఈవెంట్ లో భారత దేశానికి అనేక పతకాలను తెచ్చింది. అయితే, ఇప్పుడు ద్యుతీ ట్రాక్ నుంచి బయటకు వచ్చి బుల్లి తెరపై అడుగు పెట్టి.. తన డ్యాన్స్ ప్రావీణ్యాన్ని ప్రదర్శించనుంది. అభిమానులు ఎప్పుడూ చూడని సరికొత్త ద్యుతీని చూడనున్నారు.

‘ఝలక్ దిఖ్లా జా’ అనే టీవీ షోలో ద్యుతీ చాలా కాలం పాటు పాల్గొనబోతోంది. కొరియోగ్రాఫర్ రవీనాతో కలిసి ఈ షోలో పాల్గొననుంది. తన ఆటతో పాటు.. స్వలింగ సంపర్కాన్ని వెల్లడించిన క్రీడాకారిణిగా ద్యుతీ పేరు పొందింది

డ్యాన్స్ షో గురించి ద్యుతీ మాట్లాడుతూ, "విభిన్న నృత్య రూపాల్లో డ్యాన్స్ చేయాలని, చాలా మంది గొప్ప డ్యాన్సర్స్ తో పోటీ పడతానని తాను కలలో కూడా అనుకోలేదని చెప్పింది. ఒక క్రీడాకారిణిగా తనకు ఎదురయ్యే కొత్త సవాళ్లను స్వీకరించడం ఇష్టమని పేర్కొంది.

ద్యుతీ ఇంకా మాట్లాడుతూ, 'తాను త్వరలో ప్రేక్షకుల ముందుకు ప్రదర్శన ఇవ్వడానికి రెడీ అవుతున్నాను. ఇది నాకు పూర్తిగా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం అంత సులభం కాదు. కానీ నా కొరియోగ్రాఫర్ సహాయంతో.. నేను డ్యాన్స్ చేయడం ఛాలెంజ్‌గా తీసుకొని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపింది.

ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని ద్యుతీ తెలిపింది. తాను అందరి ముందు ప్రదర్శన చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 'ఝలక్ దిఖ్లా జా' వంటి షోలో తనను ఒక భాగస్వామిని చేసినందుకు, తనను విశ్వసించినందుకు కలర్స్ ఛానల్ కు కృతజ్ఞతలు చెప్పింది. తన ఉత్తేజకరమైన కొత్త ప్రయాణంలో అభిమానులు, ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొంది ద్యుతీ