
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ నేటి నుంచి మొదలుకానుంది. అయితే, ఈ సిరీస్‌లో రికార్డుల మోత మోగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా భారీ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. మరోవైపు దక్షిణాఫ్రికా శిబిరంలోనూ కొంతమంది ప్లేయర్లు కొన్ని స్పెషల్ రికార్డులు నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

T20 ఇంటర్నేషనల్స్‌లో ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడా 50 వికెట్లకు కేవలం ఒక వికెట్ దూరంలో నిలిచాడు. ఢిల్లీలో నేడు జరిగే తొలి టీ20లో ఈ ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. ఇదే జరిగితే ఈ ఫార్మాట్‌లో 50 వికెట్లు తీసిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా మారనున్నాడు.

కాగిసో రబాడా కంటే ముందు ఇమ్రాన్ తాహిర్, డేల్ స్టెయిన్, తబ్రేజ్ షమ్సీలు అంతర్జాతీయ టీ20లో దక్షిణాఫ్రికా తరపున అద్భుతాలు చేశారు. ప్రస్తుతం రబాడా 40 టీ20 మ్యాచుల్లో 49 వికెట్లు పడగొట్టాడు.

దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా డేల్ స్టెయిన్ రికార్డు సృష్టించాడు. స్టెయిన్ 47 మ్యాచ్‌ల్లో 18.35 సగటుతో 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 9 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి, అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఇమ్రాన్ తాహిర్ దక్షిణాఫ్రికా టీ20 ఇంటర్నేషనల్స్‌లో రెండో విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. 35 మ్యాచ్‌లు ఆడి 61 వికెట్లు తీశాడు. అదే సమయంలో, ఈ జాబితాలో 46 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీసిన తబ్రేజ్ షమ్సీ మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో షమ్సీ కూడా సభ్యుడిగా ఉన్నాడు.