
Restaurants owned by Indian cricketers: టీమిండియా మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు క్రికెట్‌లోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా వివిధ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ స్టైల్ రెస్టారెంట్‌ను ప్రారంభించి జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ రెస్టారెంట్ పరిశ్రమలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి సురేష్ రైనా మాత్రం కాదండోయ్. ఆయన కంటే ముందు రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించిన టీమ్ ఇండియా పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితా చాలా పెద్దగానే ఉంది.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ, పుణె, ముంబైలలో వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు.

ఇది కాకుండా, విరాట్ ఢిల్లీలో NUEVA అనే రెస్టారెంట్‌ను కూడా మొదలుపెట్టాడు.

కోహ్లీలాగే రవీంద్ర జడేజా కూడా చాలా ఏళ్లుగా రెస్టారెంట్ వ్యాపారంలో కొనసాగుతున్నాడు. జడేజా రాజ్‌కోట్‌లో జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ అనే రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు.

అంతకుముందు చాలా మంది క్రికెటర్లు జడేజా జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ రెస్టారెంట్‌ను సందర్శించి రుచి చూశారు.

1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కూడా పాట్నాలో 'ఎలెవెన్స్' పేరుతో రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు.

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కూడా మహారాష్ట్రలోని సాంగ్లీలో SM 18 పేరుతో ఒక కేఫ్‌ను ప్రారంభించింది. మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా 2005లో పూణేలో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.