
సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీకి ఎప్పుడూ కొదవ ఉండదు. ప్రతి ఏడాది కొత్త అందాలు వెండితెరపై సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చిన భామలు టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్న అమ్మాయిలకు కూడా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఆరాధ్య దేవి.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే వరుసగా సినిమాలు చేయాలి.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. కానీ కొంతమంది మాత్రం ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. ఇప్పుడు ఆరాధ్య దేవి కూడా ఇదే కోవలోకి వస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ భామ పేరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అందం, గ్లామర్‌తో యువతను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. సినిమాల్లో ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధమని చెప్పడం మరోసారి ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ఆరాధ్య దేవి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో కథానాయికగా పరిచయం చేశారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు చూసిన వర్మ.. ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెతో ‘శారీ’ (Saree) సినిమాను రూపొందించారు. ఈ చిత్రంతో ఆరాధ్య దేవి పేరు సినిమా ప్రేక్షకుల్లోనూ చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆమె గ్లామర్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో రీల్స్ చేసే సమయంలో సంప్రదాయబద్ధమైన చీరకట్టులో కనిపించిన ఆరాధ్య దేవి.. సినిమాల్లో మాత్రం గ్లామరస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆమె పాత వీడియోలు, తాజా ఫొటోలను పోలుస్తూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపును సినిమా అవకాశాలుగా మార్చుకోవడం ఈ రోజుల్లో కొత్త విషయం కాకపోయినా.. ఆరాధ్య దేవి విషయంలో మాత్రం ఆమె గ్లామర్, సినిమాల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఇకపై ఎలాంటి కథలు, పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

గ్లామర్ పాత్రల విషయంలో తన ఆలోచనలు మారాయని ఆరాధ్య దేవి గతంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలు చేయకూడదని అనుకున్నప్పటికీ, ఇప్పుడు తన అభిప్రాయాలు మారాయని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. గ్లామర్ అనేది వ్యక్తిగతమైన విషయమని, అది తన వృత్తిలో భాగమని ఆమె అభిప్రాయపడినట్లు ప్రచారం జరిగింది. గ్లామరస్ పాత్రలైనా, ఇతర విభిన్నమైన పాత్రలైనా తనకు వచ్చిన అవకాశాన్ని బట్టి నటించడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చింది.