
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్లలో శ్రియ శరణ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకేటష్ వంటి సీనియర్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిందీ అందాల తార.

వీరి తర్వాత పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ తదితర యంగ్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందీ అందాలతార.

అలాగే తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది శ్రియ. తన అందం, అభినయంతో దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండగానే రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చివ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ. 2018లో వీరి వివాహం జరింది. 2021లో ఈ దంపతులకు రాధా శరణ్ కొశ్చివ్ అనే కుమార్తె జన్మించింది.

పెళ్లి, పిల్లలైన తర్వాత కూడా సినిమాలు చేస్తోందీ అందాల తార. అయితే గతంలోలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపిస్తోంది. ఎక్కువగా తన ఫ్యామిలీకే సమయాన్ని కేటాయిస్తోంది శ్రియ

తాజాగా తన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లింది శ్రియ. తన భర్త, కూతురుతో కలిసి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించింది. అనంతరం తమ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.