
సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తాయని నిరూపించిన చిత్రాల్లో బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ ‘స్త్రీ’ ఒకటి. 2018లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సంచలన విజయం సాధించడమే కాకుండా, విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో నిలుస్తూ వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతోంది.

ఈ సినిమా కథ మధ్యప్రదేశ్‌లోని చందేరి అనే చిన్న పట్టణం ఆధారంగా సాగుతుంది. ఆ గ్రామంలో రాత్రి వేళల్లో ‘స్త్రీ’ అనే ఒక రహస్యమైన ఆత్మ తిరుగుతుంటుంది. ఆమె కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, వారి పేర్లతో పిలిచి మాయం చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ బారి నుండి తప్పించుకోవడానికి గ్రామస్థులు తమ ఇళ్ల గోడలపై "ఓ స్త్రీ రేపు రా" అని రాసుకుంటారు. ఈ క్రమంలో చందేరి ఊరిలో ప్రసిద్ధ దర్జీగా పేరుపొందిన విక్కీ (రాజ్ కుమార్ రావు) తన స్నేహితులతో కలసి ఈ ఆత్మ రహస్యాన్ని ఎలా ఛేదించాడు? ఆ గ్రామానికి ఆత్మ నుండి విముక్తి లభించిందా? అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం.

దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తుంది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపర్ శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీలు పోషించిన పాత్రలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా పంకజ్ త్రిపాఠి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సస్పెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

రూ.25 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. విమర్శకుల నుంచి, సామాన్య ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, బాలీవుడ్‌లో హారర్-కామెడీ యూనివర్స్‌కు బలమైన పునాది వేసింది. హారర్ డ్రామాలు, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్‌బస్టర్ మూవిని అస్సలు మిస్ కాకుండా చూడవచ్చు.

సినిమాలో కథానాయకుడు విక్కీ దర్జీ (టైలర్) పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత్రలో సహజత్వం కోసం రాజ్‌కుమార్ రావు నిజంగానే బట్టలు కుట్టడం, మిషన్ తొక్కడంలో కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఆయన స్వయంగా బట్టలు కట్ చేసి కుట్టిన సీన్స్ సినిమాలో చూపిస్తారు. మన తెలుగు దర్శకులైన రాజ్ & డికే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వారి మార్క్ హ్యూమర్, పదునైన సంభాషణలే ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.