
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సూపర్‌ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చియా విత్తనాలు, సబ్జా విత్తనాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇవి రెండూ చూడటానికి ఒకేలా ఉండటంతో చాలా మంది వీటి విషయంలో అయోమయానికి గురవుతుంటారు. పైకి చిన్నవిగా కనిపించినా.. ఈ గింజల్లో పోషకాలు మాత్రం కొండంత ఉంటాయి. కానీ వీటి రంగు, రుచి, పని చేసే విధానం పూర్తిగా వేరని మీకు తెలుసా..?

మొదటి చూపులో ఈ రెండు గింజలు ఒకేలా కనిపించినా, దగ్గరగా పరిశీలిస్తే తేడా స్పష్టంగా తెలుస్తుంది. సబ్జా గింజలు నల్లగా, గుండ్రంగా ఉంటాయి. అదే చియా గింజలు కొంచెం పొడవుగా ఉండి.. బూడిద, తెలుపు, నలుపు రంగుల మిశ్రమంతో కూడిన మచ్చలను కలిగి ఉంటాయి. మరో ముఖ్యమైన తేడా ఏమిటంటే.. సబ్జా గింజలను నీటిలో వేయగానే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఉబ్బిపోతాయి. కానీ చియా గింజలు ఉబ్బడానికి కనీసం 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.

సబ్జా, చియా గింజలు శరీరానికి చేసే మేలులో కూడా భిన్నమైనవి. సబ్జా గింజలు సహజంగానే శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే వీటిని వేసవి కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మరోవైపు చియా గింజలు శరీర ఉష్ణోగ్రతపై పెద్దగా ప్రభావం చూపవు కాబట్టి వీటిని ఏడాది పొడవునా ఎప్పుడైనా తీసుకోవచ్చు.

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే చియా గింజలు మీ ఆహారంలో ఉండాల్సిందే. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే మీకు జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి ఉంటే మాత్రం సబ్జా గింజలు తీసుకోవడం మంచిది. చియా గింజలు త్వరగా ఆకలి వేయకుండా చూస్తే సబ్జా గింజలు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి కడుపును శుభ్రపరుస్తాయి.

ఎలా ఉపయోగించాలి?: వీటి వాడకం కూడా వాటి స్వభావాన్ని బట్టి ఉంటుంది. సబ్జా గింజలను సాధారణంగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లేదా షర్బత్‌ల వంటి చల్లని పానీయాలలో కలుపుకుని తాగుతారు. కానీ చియా గింజలు పానీయాల కంటే స్మూతీలు, ఓట్స్, పుడ్డింగ్స్, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్ వంటి ఘన ఆహారాల్లో చేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరైన గింజలను ఎంచుకుని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.