
చియా గింజలతో అద్భుత ప్రయోజనాలు: వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని అధిక ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గడం సులభమవుతుంది.

తక్కువ రక్తపోటు ఉన్నవారు: చియా గింజలకు రక్తపోటును తగ్గించే గుణం ఉంది. హైబీపీ ఉన్నవారికి ఇది మేలు చేసినా, ఇప్పటికే లో-బీపీతో బాధపడేవారు వీటిని తీసుకుంటే తల తిరగడం, విపరీతమైన అలసట లేదా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: చియా గింజల్లో పొటాషియం, ఫాస్ఫరస్, ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అలాగే శరీరంలో పొటాషియం స్థాయిలు విపరీతంగా పెరిగే హైపర్‌కలేమియా స్థితికి దారితీసే అవకాశం ఉంది.

మందులు వాడేవారు : మీరు రక్తం గడ్డకట్టకుండా ఉండే మందులు వాడుతున్నట్లయితే, చియా గింజలకు దూరంగా ఉండటం మంచిది. ఇందులోని ఒమేగా-3 యాసిడ్లు మందుల ప్రభావానికి అడ్డుపడి, అధిక రక్తస్రావానికి కారణం కావచ్చు.

జీర్ణకోశ సమస్యలు: కేవలం రెండు చెంచాల చియా గింజల్లోనే 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మంచిదే అయినప్పటికీ ఒక్కసారిగా అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు వీటిని పరిమితంగానే తీసుకోవాలి.