
దాదాపు ప్రతీఒక్కరికీ సేవింగ్స్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ అకౌంట్లో మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొ బ్యాంక్‌కు ఒక్కొలా కనీస నిల్వ నియమాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ పరిమితి ఉంటే.. ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ లిమిట్ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో అసలు లిమిట్ అనేది ఉండదు. లిమిట్‌కు తగ్గట్లు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని పక్షంలో బ్యాంకుల జరిమానా విధిస్తూ ఉంటాయి. జరిమానాలు బ్యాంకును బట్టి మారతాయి.

బ్యాంక్ నిర్దేశించిన కనీస నిల్వను మీ బ్యాంకులో నిరంతరం ఉంచుకోవాలి. అకౌంట్ కేటగిరీ, నగరం, పట్టణం, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక్కొ ప్రాంతంలో ఒక్కొలా లిమిట్ నిర్ణయిస్తారు. మీ బ్యాంక్ అకౌంట్లో ఈ నియమాలను పాటించకపోతే వెంటనే పనాల్టీ పడుతుంది. అయితే బ్యాంకులు ఎందుకు జరిమానా విధిస్తాయనే అనుమానం చాలామందికి ఉంటుంది. బ్యాంక్ సేవలను కస్టమర్లకు మెరుగ్గా అందించేందుకు వీటిని వసూలు చేస్తారు.

కస్టమర్లకు బ్యాంకులు ఏటీఎం, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, కస్టమర్ సేవలు అందిస్తోంది. అలాగే కార్యాలయాల నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం బ్యాంకులు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారుల నుంచి వసూలు చేసే జరిమానాలు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడతాయి. అయితే రెండు రకాలుగా కనీస నిల్వను లెక్కిస్తారు. అందులో ఒకటి రోజువారీ నిర్దిష్ట మొత్తం.

తొలి పద్దతి ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతీరోజూ నిర్దిష్ట మొత్తం కలిగి ఉండాలి. ఇక రెండో పద్దతి.. మీ బ్యాంక్ అకౌంట్లోని నెలసరి సగటు మొత్తం ఆధారంగా లెక్కిస్తారు. నెలవారీ సగటు నిల్వ-MAB విధానంలో లెక్కింపు చేపడతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1,2026 నుంచి కనీస నిల్వ నిబంధలను ఎత్తివేసింది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, జన్ ధన్ ఖాతాలపై పరిమితిని ఎత్తివేసింది.

ఇక శాలరీ అకౌంట్లకు కనీస నిల్వ నిబంధనలు వర్తించవు. వీటిలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి పెనాల్టీలు పడవు. కానీ మీరు కంపెనీ మారినప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ ఇవ్వవచ్చు. ఇలాంటప్పడు పాత కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో కనీస నిల్వ ఉంచకపోతే అది సాధారణ సేవింగ్స్ అకౌంట్లా మారుతుంది.